జనసేన ఆఫీస్‌కు లోకేష్‌ ఎందుకు వెళ్లారు.. సైకిల్‌ పార్టీ సర్వే సంస్థలను రంగంలోకి దించిందా?

Nara Lokesh: తెలుగుదేశం యువనేత లోకేష్‌... జనసేన పార్టీ ఆఫీస్‌కు ఎందుకు వెళ్లారు?

Update: 2021-12-18 09:25 GMT

జనసేన ఆఫీస్‌కు లోకేష్‌ ఎందుకు వెళ్లారు.. సైకిల్‌ పార్టీ సర్వే సంస్థలను రంగంలోకి దించిందా?

Nara Lokesh: తెలుగుదేశం యువనేత లోకేష్‌... జనసేన పార్టీ ఆఫీస్‌కు ఎందుకు వెళ్లారు? జనసేన నాయకులు, కార్యకర్తలతో ఎందుకు ముచ్చటించాల్సి వచ్చింది? టీడీపీకి ఓ ఆఫీస్‌ ఉండగా, అక్కడే ఉన్న జనసేన కార్యాలయంలో రివ్యూలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? తెలుగు తమ్ముళ్లు షాక్‌ అయ్యేలా జనసైనికులు షేక్‌ అయ్యేలా ఎంట్రీ ఇచ్చిన లోకేష్‌ ఫ్యూచర్‌ పాలిటిక్స్‌‌ను డిసైడ్‌ చేయబోతున్నారా? తమ్ముళ్ల సందేహాలు ఏంటి వారి అభ్యంతరాలు ఏంటి?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు, టీడీపీ ఫ్యూచర్‌ లీడర్‌, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ జనసేన ఆఫీసుకు ఎందుకు వెళ్లినట్టు? ఇదే ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న ప్రశ్న. అనూహ్యంగా జ‌న‌సేన పార్టీ కార్యాలయంలో దర్శనం ఇచ్చిన లోకేష్‌ను చూసిన తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. గుంటూరు జిల్లా కుంచ‌నప‌ల్లిలో పర్యటించిన నారా లోకేష్ అక్కడి జ‌న‌సేన పార్టీ కార్యాలయానికి వెళ్లడమే కాదు అక్కడే ఉన్న జ‌న‌సేన పార్టీ నేత‌లు, కార్యక‌ర్తల‌తో ముచ్చటించారు. అభివృద్ధి ప‌నులు, పార్టీ విష‌యాల‌ గురించి లోకేష్‌ జనసైనికులతో పంచుకున్నట్టు తెలుస్తుంది.

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన నారా లోకేష్ అనూహ్యంగా ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా మంగళగిరి నుంచి గెలిచేందుకు లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ నేతలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న లోకేష్ ఎవ్వరూ ఊహించని విధంగా, ఊహకు అందకుండా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కుంచనపల్లిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇదే సమయంలో అక్కడ స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలతో కూడా లోకేష్ సమావేశమయ్యారు. తాడేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు శివ నాగేంద్ర ఇంటికి వెళ్లి లోకేశ్ పలకరించారు. రాబోయే ఎన్నికల్లో కలిసి పని చేయాలని అంటూ లోకేష్‌ ప్రతిపాదించారు. ఏ సమస్య వచ్చినా సరే నేరుగా తనను స్వయంగా కలవాలని సూచించారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని లోకేశ్ పరిశీలించారు కూడా. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీ పొత్తు దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది.

ఏపీలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. 2014 ఎన్నికల సమయంలో పోటీ చేయనప్పటికీ బీజేపీ, టీడీపీలకు మద్దతుగా జనసేనాని పవన్‌కల్యాణ్‌ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రాష్ట్రంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అయితే, అనూహ్యంగా తెలుగుదేశం పార్టీతో విభేధించారు. ఆ తర్వాత బీజేపీకి కూడా దూరమయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. 2019 ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు.

ఇదే సమయంలో మరోసారి పవన్‌తో దోస్తీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు రెండేళ్లు గడువున్నా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించిందన్న చర్చ మొదలైంది. సర్వే సంస్థలను రంగంలోకి దించిన సైకిల్ పార్టీ వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించేందుకు అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు కంకణం కట్టుకున్నాయన్న ప్రచారం జరుగుతోంది. టార్గెట్ వైసీపీ అంటూ టీడీపీ, జనసేన మరోసారి చేతులు కలిపేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఏమైనా జ‌న‌సేన, తెలుగుదేశం పార్టీలు రెండు ఒక్కటేన‌ని అధికార పార్టీ వైసీపీ చెబుతున్నట్టు అది నిజమే అన్నట్టు లోకేష్‌ జనసేన ఆఫీస్‌కు వెళ్లడం వల్ల తేలిపోయిందంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి లోకేష్ జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలోకి వెళ్లడంతో పెద్ద చర్చకు దారితీస్తుండటంతో దీనికి యువనేత ఆన్సర్‌ ఎలా ఉండబోతోందన్నదే తెలుగు తమ్ముళ్లను వెంటాడుతోందట. మరి లోకేష్‌ పర్యటనపై టీడీపీ రెస్పాన్స్‌ ఏంటో చూడాలి.

Tags:    

Similar News