Whatsapp మెసేజ్‌తో ప్రభుత్వ సేవలు.. మెటాతో డీల్‌పై సంతకం చేసిన లోకేశ్

Update: 2024-10-23 14:05 GMT

Citizen services on WhatsApp in AP: చంద్రబాబు ప్రభుత్వం ఈ-గవర్నెన్స్ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా ఇకపై ప్రజలు చిటికెలో తమ పనులు చక్కబెట్టుకోవచ్చు. ప్రభుత్వ సేవలను ప్రజలు వేగంగా అందుకునేందుకు వీలుగా చంద్రబాబు ప్రభుత్వం వాట్సప్‌ యాప్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మెటాతో కలిసి ప్రజలకు సేవలందించేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేష్, వాట్సాప్ మాతృ సంస్థ అయిన మెటా ప్రతినిధులు ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. నారా లోకేశ్ చొర‌వ‌తో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ పౌర‌సేవ‌లు వాట్సాప్ బిజినెస్ ద్వారా అందించేందుకు మెటా అంగీక‌రించింది.

అధికారంలోకి రాకముందు యువగళం పాదయాత్ర చేపట్టిన నారా లోకేశ్‌కు ఆ సమయంలో విద్యార్థులు, యువత నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. కుల, ఆదాయం తదితర ధ్రువపత్రాలు పొందడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని నాడు లోకేశ్‌కు వివరించారు. యువత ఫిర్యాదును దృష్టిలో ఉంచుకున్న లోకేశ్‌ తాజాగా మెటాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సమయం వృథా కాకుండా సర్టిఫికెట్లు అందేలా వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లతో సహా ఇతర పౌరసేవలు అందేలా చూడాలని నిర్ణయించారు.

మెటా నుంచి క‌న్స‌ల్టేష‌న్ టెక్నిక‌ల్ స‌పోర్ట్, ఈ గ‌వ‌ర్నెన్స్ అమ‌లు, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా మ‌రిన్ని పౌర సేవలు ఏపీ ప్ర‌భుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్ర‌తినిధులు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఒప్పందం చేసుకున్నారు. టెక్నిక‌ల్ స‌పోర్ట్, ఈ గ‌వ‌ర్నెన్స్, ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్ ద్వారా మ‌రిన్ని సిటిజెన్ స‌ర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి మెటా అందించనుంది. ఈ విషయాన్ని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మెటాతో ఎంవోయూ ఒక చరిత్రాత్మ‌క‌ మైలురాయి అని మంత్రి లోకేశ్ అభివ‌ర్ణించారు. త్వరలోనే మెటా టెక్నాలజీ ద్వారా పౌర సేవలను ప్రజలకు ఒక్క క్లిక్ ద్వారా సమర్ధంగా అందజేస్తామని ట్వీట్ చేశారు.

Tags:    

Similar News