Nara Lokesh: యువగళం పాదయాత్ర మాత్రమే కాదు... యువకులకు భరోసా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. యువగళం ఆగదు.. వారాహి ఆగదు అని స్పష్టం చేశారు. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తామని... యువగళం అంటే ప్రజాగళం అని అన్నారు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు... జాదూరెడ్డి జాబ్ క్యాలెండర్‌లో జాబ్స్ ఉండవు అని లోకేశ్ విమర్శించారు. ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడ్డారని, కనీసం ఒక కానిస్టేబుల్ ఉద్యోగమైనా ఇచ్చారా, మెగా డీఎస్సీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మూడేళ్లలో జే ట్యాక్స్ మాత్రమే అమలు చేశారని.. జాబులు మాత్రం శూన్యమని అన్నారు. నాకు చీరా గాజులు పంపుతానని మహిళా మంత్రి అన్నారు... ఆ చీర, గాజులు పంపిస్తే మా అక్క చెల్లెళ్లకు ఇచ్చి వారి కాళ్లు మొక్కి గౌరవిస్తానని అన్నారు. తల్లిని, చెల్లిని మెడబట్టి బయటకు గెంటే సంస్కృతి నాకు తెలియదంటూ చురకలంటించారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని లోకేశ్ మండిపడ్డారు. యువత, రైతులు... ఇలా అన్ని వర్గాల వారు ఈ ప్రభుత్వ బాధితులేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఘనుడు జగన్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుకైనా వేశారా అని నిలదీశారు.