Nara Lokesh: నేడు సీఐడీ విచారణకు నారా లోకేష్
Nara Lokesh: కొత్తగా ఐదుగురు అధికారులను నిందితులుగా చేరుస్తూ పిటిషన్
Nara Lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు నారా లోకేష్. గత 20 రోజులుగా ఢిల్లీలో ఉన్న లోకేష్.. విచారణకు హాజరయ్యేందుకు రాత్రి మంగళగిరి చేరుకున్నారు. IRR అలైన్‌మెంట్ మార్పు కేసులో ఏ-14గా లోకేష్‌ను చేరుస్తూ సీఐడీ మెమో ఫైల్ చేసింది. ఈ కేసులో లోకేష్‌ను విచారిస్తామని ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈనెల 4న లోకేష్‌ను విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చింది. అయితే ఈ నోటీసుల్లో అకౌంట్ బుక్స్, హెరిటేజ్ బోర్డు తీర్మానాలు తీసుకురావాలని సీఐడీ కోరింది.
ఈ నిబందనలను నారా లోకేష్ హైకోర్టులో సవాల్ చేయగా.. అకౌంట్ బుక్స్ కోసం ఒత్తిడి చేయొద్దని ఆదేశించింది. లోకేష్‌ను న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సీఐడీ విచారణకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఇక లోకేష్ విచారణ నేపథ్యంలో తాడేపల్లి సిట్ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. కొత్తగా ఐదుగురు అధికారులను నిందితులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణిశంకర్, రావూరి సాంబశివరావు, కొత్తపు అరుణకుమార్ పేర్లను చేర్చింది.