రాంగ్ కాల్.. తెలుగు యువతికి, పాకిస్తానీయుడికి మధ్య ప్రేమ.. చివరికి జైలు పాలు..
Gulzar Khan: తప్పు నిప్పు లాంటిది... ఆది ఎప్పటికి అయినా గుప్పుమనక మానదు అన్నారు పెద్దలు.
Gulzar Khan: తప్పు నిప్పు లాంటిది... ఆది ఎప్పటికి అయినా గుప్పుమనక మానదు అన్నారు పెద్దలు. ఇది అక్షర సత్యమని నంద్యాల జిల్లాలో జరిగిన సంఘటన నిరూపిస్తోంది. పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి అక్రమంగా భారత్లోకి ప్రవేశించి.. ఓ యువతి తో సహజీవనం చేసి చివరికి జైలు పాలు అయ్యాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. కష్టాల కడలిలో కొట్టు మిట్టడుతున్న ఆ కుటుంబం పై స్పెషల్ స్టోరీ.
అక్రమ చొరబాటు చివరికి జైలు పాలు చేసింది..పాకిస్తాన్ కు చెందిన గుల్జార్ ఖాన్ కు ఓ రాంగ్ కాల్ ద్వారా నంద్యాల జిల్లా గడివేములకు చెందిన మహిళతో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ప్రియురాలి కోసం అక్రమంగా పాకిస్తాన్ నుంచి గడివేములకు వచ్చాడు. ప్రేమించిన యువతితో నిఖా చేసుకొని నలుగురు పిల్లల్ని కన్నాడు. అయితే చివరికి గుల్జార్ ఖాన్ అక్రమంగా భారత్ లో ఉంటున్నాడన్న విషయం బయట పడటంతో జైలు పాలయ్యాడు.
2011లో భారత్ కు వచ్చిన గుల్జార్ ఖాన్ 2020లో తన భార్యా పిల్లలతో కలిసి తిరిగి పాకిస్తాన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ముందు సౌదీ వెళ్లి అక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలో సౌదీ వెళ్లడానికి సిద్ధమైన గుల్జార్ ఖాన్ ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో అతని భార్యాపిల్లలు తిరిగి గడివేములకు చేరుకున్నారు.
2021లో గుల్జార్ ఖాన్ కు కరోనా సోకడంతో బెయిల్ పై బయటకు వచ్చాడు. సంవత్సరం పాటు భార్యా పిల్లలతో కలిసి ఉన్నాడు. అయితే కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో అతన్ని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుల్జార్ ఖాన్ ను విడుదల చేయాలని అతని భార్య కోరుతోంది. తమ తండ్రిజైలుకు వెళ్లడంతో తమ పరిస్థితి ధీనంగా తయారైందని గుల్జార్ ఖాన్ పిల్లలు అంటున్నారు. ఎలాగైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు.