స్మార్ట్ సిటీ విశాఖలో మల్టిలెవల్ కారు పార్కింగ్.. ఒకే చోట వంద కార్లు...
Visakha Smart City: మల్టీ లెవల్ పార్కింగ్ లో ఎవరైనా కారు పార్కింగ్ చేసుకోవచ్చు...
Visakha Smart City: సాగరతీరం స్మార్ట్ సిటీ విశాఖలో రోజు రోజుకు పెరుగుతున్న పార్కింగ్ సమస్యకు జీవీఎంసీ చెక్ పెట్టింది. వంద కార్లు ఒకే చోట పార్కింగ్ చేసే విధంగా మల్టీలెవల్ కారు పార్కింగ్ అందుబాటులోకి తీసుకు వచ్చారు. అత్యాధునిక రోబోటిక్ ఆటోమెషన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట కారును ఉంచి డ్రైవర్ దిగగానే కారు పైకి వెళ్తుంది. వాహనాలు పార్కింగ్ చేసిన ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా స్ప్రింకర్లను ఏర్పాటు చేశారు. వీటికి ప్రత్యేక సెన్సార్లను అనుసంధానించారు.
అగ్నిప్రమాదం సంభవిస్తే సెన్సార్ల ద్వారా స్ప్రింకర్లకు సమాచారం అందుతుంది.. వెంటనే నీరు చల్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు రెండు ట్యాంకుల నిండా నీరు ఉంచుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట కారును ఉంచి దిగగానే.. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ లోకి వెళుతుంది. పార్కింగ్ చేసిన సమయం.. ఏ అంతస్తులో ఉంది అనే వివరాలతో బిల్లు వస్తుంది. మల్టీలెవల్ పార్కింగ్ లో ఎవైరనా తమ కార్లను పార్కింగ్ చేసుకోవచ్చు. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో యజమాని ఏ ఫోన్ నెంబర్ ఇస్తారో..పార్కింగ్ సమయంలోనూ అదే నెంబర్ చెబితేనే బిల్లు వస్తుంది.
ఇతర ఏ ఫోన్ నెంబర్ చెప్పినా కారు పార్కింగ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎవరైనా దొంగ కార్లు తెచ్చి ఇక్కడ పార్కింగ్ చేయడానికి అవకాశం ఉండదు. విశాఖ నగరంలో నిత్యం రద్దీగా ఉండే జగదాంబ సెంటర్ లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలన్న లక్ష్యంతో ఆధునిక సాంకేతిక వ్యవస్థతో మల్టీలెవల్ కార్ పార్కింగ్ సిస్టం అందుబాటులోకి తీసుకు వచ్చామని జీవీఎంసీ మేయర్ చెప్పారు. నగర వాసులు ఆవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.