YS Avinash Reddy: సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ..
YS Avinash Reddy: గత దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌పై అవినాష్ ఆరోపణలు
YS Avinash Reddy: వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రామ్ సింగ్ పై ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పక్షపాత వైఖరితో రాంసింగ్ దర్యాప్తు చేశారని ఆరోపించారు. ఎస్పీ రామ్ సీంగ్ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలని కోరారు అవినాష్ రెడ్డి. సిబిఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్ షీట్ల ఆధారంగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే హత్య జరిగిందంటూ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని నిందితులుగా చేర్చుతూ సీబీఐ ఇటీవల అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. దీంతో అవినాశ్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు 96 పేజీల లేఖ రాశారు.
వివేకా రెండో వివాహం , బెంగళూరు ల్యాండ్ సెటిల్ మెంట్ అంశాలు లేఖలో కడప ఎంపీ ప్రస్తావించారు. దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్ సింగ్ విచారణ జరిపారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. రెండో భార్య పేరిట వున్న ఆస్తిపత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి వుండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదని ఎంపీ పేర్కొన్నారు. మున్నా లాకర్‌లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. విచారణలో రామ్ సింగ్ చేసిన తప్పులను సవరించాలని ఆయన కోరారు.
పర్యవేక్షణ మాత్రమే చేపట్టాల్సిన రామ్‌సింగ్ నిబంధనలకు విరుద్ధంగా స్వయంగా విచారణ జరిపారని తెలిపారు ఎంపీ అవినాష్ రెడ్డి. తన అధికారిక నియామకానికి ముందే ఎలా విచారణ జరుపుతారని అవినాశ్ ప్రశ్నించారు. సునీతారెడ్డితో కుమ్మక్కై.. ఈ కేసులో తనను, తన తండ్రి భాస్కర్‌రెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఇరికించారని ఆరోపించారు. పలువురు సాక్షుల వాంగ్మూలాలను రామ్‌సింగ్ పూర్తిగా మార్చేశారని ఆరోపించారు. ఆస్తిని కాపాడుకోవడానికి సునీతారెడ్డి భర్త రాజశేఖర్‌రెడ్డే వివేకా హత్య చేయించారని.. కేసు నుంచి భర్తను కాపాడుకోవడానికే ఆమె తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని అవినాశ్ పేర్కొన్నారు. గూగుల్ టేకవుట్ సాక్ష్యాలు కూడా రామ్‌సింగే సృష్టించారని ఆరోపించారు. రెండో భార్య షమీమ్‌తో ఆస్తి తగాదా ఉన్న విషయాన్ని కూడా అవినాష్‌రెడ్డి తన లేఖలో పొందుపరిచారు. ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే వివేకాను హత్య చేసి ఉండొచ్చని అవినాష్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.