యాచకుని ఇంట్లో నోట్ల కట్టలు.. భిక్షాటన చేసే సాధువు గుండెపోటుతో మృతి
*గత ఐదేళ్లుగా రక్షరేకులు కడుతూ భిక్షాటన చేస్తూ జీవనం
Kakinada: భిక్షాటన చేసుకుని జీవించే ఓ సాధువు గుండెపోటుతో మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యాచకుడి గదిలో అతడి వివరాల గురించి తనిఖీ చేయగా నోట్ల కట్టలు చూసి షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. కరప మండలం వేళంగిలో రామకృష్ణ అనే సాధువు ఐదేళ్ల క్రితం గ్రామానికి వచ్చి భిక్షాటన చేస్తూ, రక్ష రేకులు కడుతూ జీవించేవాడు.
ఉన్నట్టుండి గుండెపోటుతో మృతిచెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు యాచకుని గదిలో కరెన్సీ నోట్లున్న పాలిథిన్ కవర్లు కనిపించాయి. ఈ సొమ్ము మొత్తం దాదాపు 2లక్షల వరకు ఉంటుందని స్థానికుతు చెబుతున్నారు. చీకటి పడటం వల్ల, చిల్లర నోట్లు కావడంతో లెక్కించడం సాధ్యం కాకపోవడంతో ఆ సొమ్మును ఇవాళ లెక్కించనున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రామకృష్ణ మృతదేహాన్ని ఖననం చేశారు.