Mobile Phones Container Theft: ఆంధ్ర-కర్ణాటక బోర్డర్‌లో సినీఫక్కీలో చోరీ
* రూ.6.5కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల అపహరణ * కంటైనర్ డ్రైవర్‌ను అడవిలోకి తీసుకెళ్లి చితకబాదిన దొంగలు
Mobile Phones Container Theft: హైవేపై ముందు ఓ కంటైనర్ పోతుంటే.. దానిని ఓవర్ స్పీడ్‌తో వెనుక నుంచి వెంబడించి, కంటైనర్ డోర్లను పగలగొట్టి లోపలకి చొరబడి దొంగతనం చేయడం.. ఇదంతా మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. సేమ్ అలాంటి సీనే. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరులో సెల్‌ఫోన్లతో వెళ్తున్న ఓ కంటైనర్‌ను వెనుక నుంచి వెంబడించారు దుండగులు. నెంగలి చెక్‌పోస్ట్ దాటిన తర్వాత కారుతో అడ్డగించి కంటైనర్ డ్రైవర్‌ను సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఓ మూలన పడేశారు.
అనంతరం కంటైనర్‌లో ఉన్న ఆరున్నర కోట్లు విలువచేసే మొబైల్ ఫోన్లతో ఉండాయించారు. అష్టకష్టాలు పడి ఎలాగోలా అడవి నుంచి బయటకు వచ్చిన డ్రైవర్ సురేష్ స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.