బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో వైసీపీ, టీడీపీలతో కలసి ప్రయాణం చేయదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన ప్రత్యామ్నాయ శక్తిగా ఉంటుందని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే దిశగా వైసీపీ, టీడీపీలు పని చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ విషయంలో ఈ రెండు పార్టీలది తప్పు అని ఆయన ఎద్దేవాచేసారు. సుప్రీం కోర్టుకు రాసిన లేఖను బహిర్గత పరచడం తప్పు అని ఆయన అన్నారు. అమరావతి, విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు.
భారీ వర్షాలకు రాయలసీమ రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. దీనిపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందని, కనీసం నష్టపోయిన పంటను పరిశీలించలేదన్నారు. పంట నష్టపోయిన ప్రతి ఒక్కర్నీ ఆదుకోవాలని, తడిచిన పంటను ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేసారు. మంత్రులతో కూడిన కమిటీ పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. వ్యవసాయ బిల్లులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులకు ఇన్నిరోజులుగా లేని స్వాతంత్రాన్ని ఈ బిల్లుల ద్వారా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.