ఇప్పటి వరకు ఉప్పు - నిప్పుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు ఒకటయ్యారు. ఒకే పార్టీలో ఉంటూ అటు అధినాయకత్వానికి ఇటు పార్టీ కేడర్ కు సమస్యగా మారిన ఆ ఇద్దరిలో సడన్ గా మార్పు మొదలైంది. ఆ ఇద్దరు మారాలని కోరుకున్న వారిలోనే, ఇప్పుడది కొత్త చర్చకు కారణమైంది. ఇంత ఆకస్మికంగా వారిద్దరిలో ఈ మార్పు ఏంటి? ఇప్పటిదాకా నియోజకవర్గంలో ఇద్దరి ఆధిపత్య యుద్ధంలో, మూడో నేత ఎంట్రీతో అసలు ముప్పు గ్రహించారా? అదే వారిని ఒక్కటయ్యేలా చేసిందా?
ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. గొడవల రగడను పక్కనపెట్టి రాజీ అయ్యారు. విమర్శలొచ్చినా, అధిష్టానం చెప్పినా వినని ఆ ఇద్దరు..ఎలా దారికొచ్చారు? సెగ్మెంట్‌లో మూడో నేత ఎంట్రీతో వారిలో కలవరపాటు మొదలైందా? ఆ మూడో వ్యక్తి నుంచి కాపాడుకోవడానికే ఇరువరూ ఒకే మాట, ఒకే బాట పట్టారా? ఇంతకీ ఎవరా మూడో వ్యక్తి?
బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి గొడవ కొత్తది కాదు. ఎన్నికల నాటి నుంచే వీరి మధ్య రగడ రాజుకుంది. నియోజకవర్గంలో ఆధిపత్య పోరు అధిష్టానానికి తలనొప్పిలా మారింది. తాడికొండ రాజధాని ప్రాంతం కావడంతో, రాష్ట్రమంతా, వీరి మధ్య యుద్ధం రచ్చరచ్చ అయ్యింది. తాడికొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉండవల్లి శ్రీదేవి, వృత్తి రీత్యా డాక్టర్. రాజకీయ ఆరంగ్రేటంతోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. డాక్టర్‌గా ప్రజల నాడి పట్టిన ఉండవల్లి శ్రీదేవి, సొంత పార్టీలోని ద్వితీయ శ్రేణి క్యాడర్ నాడీ పట్టడంలో తడబడుతున్నారు. దీంతో సొంత పార్టీలోని వారితోనే శ్రీదేవికి, తలనొప్పులు మొదలయ్యాయి. రాజకీయంగా ప్రతిపక్షంలోని ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన శ్రీదేవి, స్వపక్షంలోని శత్రువులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇదే నియోజకవర్గానికి చెంది, బాపట్ల ఎంపీగా గెలిచిన నందిగం సురేష్, ఇక్కడ ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. తన నియోజకవర్గంలో బాపట్ల ఎంపీ సురేష్ పెత్తనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి. పార్టీ వేదికలపై మాటల తూటాలు పేల్చుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ తరుణంలోనే స్థానిక గ్రూపు రాజకీయాల కారణంగా, సురేష్‌తో విభేదించే కొంతమంది నేతలు శ్రీదేవి పంచన చేరారు.
ఎంపీ సురేష్ మీద కోపంతో తన వద్దకు వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు శ్రీదేవి. పేకాట, ఇసుక, మైనింగ్ అక్రమ రవాణా లాంటి వాటితో పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా, కొందరు మద్దతుదారులు వ్యవహరించారు. దీంతో తుళ్ళూరు మండలానికి చెందిన ముగ్గురు ద్వితీయశ్రేణి నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు శ్రీదేవి. దీంతో సస్పెండ్ అయిన నేతలు శ్రీదేవిని టార్గెట్ చేసి, ఆమెను పలు విదాలుగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు కొత్త కావడంతో ప్రత్యర్ధులు వేసే ఎత్తులకు, పైఎత్తులు వెయ్యలేక సతమతమయ్యారామె. సురేష్, శ్రీదేవిల విభేదాలు మరింత రచ్చ కావడంతో, అధిష్టానమే పిలిపించి, ఇద్దర్నీ మందలించింది. పెద్దల ముందు సరే అన్నప్పటికీ, కొంతకాలం తర్వాత మళ్లీ అదే తంతు. గ్రూపు గొడవలు, అనుచరులపై పోటాపోటీ కేసులు. ఇంతమంది చెప్పినా గొడవలు వీడని శ్రీదేవి, సురేష్‌ల్లో సడెన్‌గా మార్పు వచ్చింది. ఇద్దరూ రాజీ అయ్యారు. అందుకు కారణం మూడో నాయకుడి ప్రవేశం. ఆయనే మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్.
తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్, టిడిపిని వీడి వైసిపిలో చేరడంతో, తాడికొండ రాజకీయం రసవత్తర మలుపు తీసుకుంది. డొక్కా రాకతో తాడికొండ నియోజకవర్గంలో, కొత్త వర్గం పుట్టుకొచ్చింది. ఇప్పటికే ఎంపీ నందిగం సురేష్‌తో, పార్టీ నుంచి సస్పెండైన నేతలతో గ్రూపు రాజకీయాలు ఎదుర్కొంటున్న ఉండవల్లి శ్రీదేవి, తాజాగా డొక్కా రూపంలో మరో గ్రూపు తయారు కావడంతో అప్రమత్తమయ్యారు. దీంతో పార్టీలోని సీనియర్ల సలహాతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు శ్రీదేవి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు తనకు, ఎంపీ నందిగం సురేష్‌కు శత్రువులు కావడంతో, ముందుగా వారిని అడ్డు తొలగించుకునే ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా తొలి నుంచి శత్రువుగా ఉన్న నందిగం సురేష్‌తో, మిత్రత్వం కోరుతూ, కుటుంబ సమేతంగా సురేష్ ఇంటికి వెళ్లారట ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. మూడు గంటలకుపైగా సాగిన చర్చలు, రాజీమార్గాన్ని ఉపదేశించాయట.
నియోజకవర్గంలో తామిద్దరం ఇలా గొడవలు పడుతూ ఉంటే, మూడో నేత బలపడతారనే అంచనాకు వచ్చారట సురేష్, శ్రీదేవి. అంతే. ఇద్దరిలోనూ కలవరం మొదలైంది. కలిసి పని చెయ్యాలని, ఏ సమస్య ఉన్నా, తమలో తామే పరిష్కరించుకోవాలని నిర్ణయించారట. ఇద్దరం కలసి ఉంటే, నియోజకవర్గంలో ప్రత్యర్థులను ఎదుర్కొవడమే కాకుండా, కొత్తగా మరో వర్గాన్ని ఏర్పాటు చేస్తున్న డొక్కాకు సైతం చెక్ పెట్టొచ్చనే ఆలోచన చేశారట. అలా మూడో నేత ప్రవేశం, స్వపక్షంలో విపక్షంలా కత్తులు దూస్తున్న ఇద్దరిలోనూ మార్పుకు కారణమైందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే, ఒకరి వర్గంపైన మరో వర్గం కేసులు పెట్టుకొనే స్థాయి వరకు వెళ్లిన ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గాలు, ఇప్పుడు ఎమ్మెల్సీ డొక్కా వర్గం బలపడకుండా కలిసి ఉండాలని భావిస్తున్నా ఈ ఒప్పందం ఎంత కాలం ఉంటుంది? వీరు ఏ రకంగా కలిసి సాగుతారనేది, ఇప్పుడు పార్టీలో ఉత్కంఠ చర్చ. పార్టీకి సమస్యగా మారిన ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారం, ఇక పరిష్కారం అయినట్టేనా...? లేక తిరిగి సమరం మొదలవుతుందా, కాలమే సమాధానం చెప్పాలి.