చారిత్రాత్మక కట్టడమని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్
విజయనగరంలో శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను గురువారం అధికారుల తొలగించిన విషయం తెలిసిందే.
విజయనగరంలో శిథిలావస్థకు చేరిన మూడు లాంతర్లను గురువారం అధికారుల తొలగించిన విషయం తెలిసిందే. వాటి స్థానంలో ఆధునిక హంగులతో కొత్త కట్టడాన్ని చేపట్టనున్నారు. లాంతర్ల ఆధునీకరణ పనులపై టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శలు గుప్పించారు. పురాతన కట్టడాలన్నీ వైసీపీ ప్రభుత్వం తొలిగిస్తూందని విమర్శించారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ.. చారిత్రాత్మక కట్టడమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఈ కట్టడం నమోదైందని నిరూపిస్తారా? అని సవాల్ విసిరారు.
ఆదివారం విజయనగరంలో ఎమ్మెల్యే వీరభద్రస్వామి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాతో ప్రజలు ఇబ్బందిపడితే పట్టించుకోకుండా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాకే పరిమితమయ్యారని, ఇప్పుడేమో ఉనికి కోసం రోడ్డెక్కుతున్నారని విమర్శించారు. పురాతన కట్టడాలు మోతి మహాల్, పూల్ బాగ్ ప్యాలెస్‌లను నేలమట్టం చేసినప్పుడు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.
కేవలం రాత్రిపూట ప్రజలకు దారి చూపేందుకు మాత్రమే మూడు లాంతర్లు ఏర్పాటు చేశారని వీరభద్ర స్వామి స్పష్టం చేశారు.
చారిత్రక నేపథ్యమున్న కట్టడాలను కూల్చుతారన్న ఆరోపణలు అర్థరహితమని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ వెల్లడించారు. నగరంలోని 6 ప్రాంతాలను ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టామని అయన తెలిపారు. మూడు లాంతర్లను ముగ్గురు మహిళలు చేతబూనేలా స్థూపాన్ని రూపొందించనున్నట్టు వెల్లడించారు.