Minister Kollu Ravindra warns ex minister Perni Nani: పేర్ని నానికి, ఆయన బినామీలకు మంత్రి కొల్లు రవీంద్ర నేరుగానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పేర్ని నానికి, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం తినేసి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని అన్నారు. భార్య పేరుతో గోడౌన్ ఉంటే అక్కడేం జరుగుతుందో చూసుకోవాల్సిన జాగ్రత్త లేదా అని ప్రశ్నించారు. ఇదంతా కేవలం ఆమె పేరు వాడుకుని బయటపడాలనుకోవడమే అవుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు.
పేర్ని నానిని ఉద్దేశించి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... దొంగతనం చేసి ఆ సొమ్ము తిరిగిచ్చేస్తే దొర అయిపోరు.. దొంగ దొంగే అవుతారని అన్నారు. పేర్ని నాని పోర్టు చుట్టుపక్కల గ్రామాల్లోని భూములు లాక్కోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. అందుకే పేర్ని నాని ఇక చట్టం నుండి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
నా మీద కక్షతో నా భార్య క్యారెక్టర్ దెబ్బ తీస్తున్నారు: పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌లో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయన్న ఈ వివాదంపై తాజాగా స్వయంగా ఆయనే స్పందించారు. తన మీదున్న కక్షతో తన భార్యపై కేసు పెట్టి ఆమె క్యారెక్టర్‌ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున తాను ఈ వివాదం గురించి ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని అన్నారు.
ఈ కేసులో తమ తప్పేమీ లేదని పేర్ని నాని వివరణ ఇచ్చారు. 60 ఏళ్ల వయస్సు దగ్గరపడుతున్న తరుణంలో గోడౌన్ రెంట్‌తో వచ్చే ఆదాయం తమకు ఆధారం అవుతుందనే ఉద్దేశంతోనే ఆ గోడౌన్ నిర్మించడం జరిగింది కానీ అంతకు మించి మరే ఇతర దురుద్దేశం లేదన్నారు. సూపర్‌వైజింగ్‌లో జరిగిన పొరపాటే తప్పు ఇందులో తమ ప్రమేయం లేదని పేర్ని నాని (Perni Nani about his wife godown) తెలిపారు.