Rains in AP: ఏపీలో మరోసారి మూడు రోజులపాటు వర్షాలు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది రాబోయే 36 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దాని ప్రభావంతోనే ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాయలసీమతో పాటు దక్షిణకోస్తాలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
10వ తేదీ వరకు వాతావరణంలో పెద్దగా మార్పులు లేనప్పటికీ, 11వ తేదీ మధ్యాహ్నం నుండే మార్పులు కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆక్యూవెదర్.కామ్ వెల్లడించిన వివరాల ప్రకారం 13వ తేదీన మధ్యాహ్నం రాయలసీమతో పాటు కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల నేపథ్యంలో వ్యవసాయం పనుల్లో నిమగ్నమయ్యే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఏపీ విపత్తుల నివారణ సంస్థ అధికారులు సూచించారు.