Andhra Pradesh: చేదు ఫలితాలు మిగులుస్తున్న మామిడి పంట

Andhra Pradesh: రెండేళ్లుగా పంట దిగుబడి లేక నష్టాల్లో రైతులు

Update: 2022-04-22 02:31 GMT

Andhra Pradesh: చేదు ఫలితాలు మిగులుస్తున్న మామిడి పంట

Andhra Pradesh: ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు నోరూరిస్తాయి. అయితే కరోనా కారణంగా మామిడి పంట రెండేళ్లుగా చేదు అనుభవాలనే మిగులుస్తోంది. ఈసారైతే పంట దిగుబడి అత్యంత దారుణంగా పడిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టాల ఊబి నుంచి కోలుకోవడం అసాధ్యమని ఆవేదన చెందుతున్నారు. మార్కెటింగ్ మీద దృష్టి సారించకపోతే మామిడి రైతుల ఆత్మహత్యలు కూడా చూడాల్సి రావచ్చేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పూత చూసి కాత బాగానే కాస్తుందనుకున్నారు ఈసారి మామిడి రైతులు. అయితే పూసిన పూతకు, కాసిన కాతకు ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. ఇదే ఇప్పుడు మామిడి రైతుల్ని తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తోంది. ఆంధ్రా, రాయలసీమలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందంటున్నారు మామిడి రైతులు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన నెల్లూరు జిల్లాలో కలిసింది. ఇక్కడ దాదాపు 32వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన ఉలవపాడు ప్రాంతంలో పెద్ద మొత్తంలో మామిడి తోటలున్నాయి. పాత నెల్లూరు జిల్లా కావలి, వింజమూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో కూడా తోటలు విరివిగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది పూత కాస్త ఆలస్యంగా వచ్చినా ఎక్కువే వచ్చిందని అయినా అది చెట్టుకి నిలబడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి రిపీట్ అవుతోందని వాపోతున్నారు. లెక్క ప్రకారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక లక్షా 60 వేల టన్నుల దిగుబడి రావాలని కానీ ఈసారి మాత్రం 45 వేల టన్నులు మాత్రమే రావచ్చని రైతులు దిగాలుపడుతున్నారు.

ఇక మధుర మామిడి రసాలకు పెట్టింది పేరు కృష్ణా జిల్లాలోని నూజివీడు. దేశ విదేశాలకు సైతం నూజివీడు మామిడి ఎగుమతి అవుతుంది. అయితే మామిడిలో ఉండే బంగినపల్లి, తోతాపురి, చిన్న రసం, పెద్ద రసం, నల్ల రసం, జలం, చెరుకురసం, సువర్ణ రేఖ, ఇమామ్ పసంద్, జాంగిర్, దునియా చక్కర్, అల్ఫాన్సా ఇలా శ్రేష్టమైన మామిడిలో కొన్ని రకాలు అంతరించిపోయే పరిస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. గత రెండేళ్లుగా దిగుబడి తగ్గిపోవడంతోనే రైతులు మామిడి పంటకు స్వస్తి చెప్పే ప్రమాదం తలెత్తిందంటున్నారు. గతంలో ఈదురు గాలి, దుమ్ము వల్ల కాయలు నేలరాలి రైతులు నష్టపోతే రెండేళ్లుగా కరోనా పుణ్యాన నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది నల్ల తామర పురుగు కారణంగా దిగుబడి 10 శాతమే వచ్చిందంటున్నారు.

ఇక మామిడి అనేది చిత్తూరు జిల్లాలో పంట స్థాయిని దాటి పరిశ్రమగా ఎదిగింది. పెద్దపెద్ద రైతుల దగ్గర నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు మామిడితో అధిక లాభాలు ఆర్జించారు. ఇతర ప్రాంత పారిశ్రామికవేత్తలను సైతం మామిడి వైపు చూసేలా చేశారు. అయితే అకాలవర్షాలు మామిడి రైతులను కుదేలు చేస్తున్నాయి. ప్రతిసారీ పూత సమయంలో వర్షాలు కురవక పంట దిగుబడి తగ్గిపోయేది. ఈసారి మాత్రం నవంబర్, డిశంబర్ మాసాల్లో కురిసిన అకాల, అధిక వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి.

సరిపడినంత వేడిమి లేకపోవడంతో పూత నిలువకపోవడం దిగుబడి తగ్గడానిక ఒక కారణమైతే ఎప్పుడూ చూడని చీడపీడలు వచ్చాయని అందువల్ల స్ప్రేలు ఎక్కువగా కొట్టాల్సి వచ్చిందని అందువల్ల దిగుబడి 20 శాతమే వచ్చిందని చిత్తూరు రైతులు వాపోతున్నారు.

గతేడాది కన్నా ఈసారి మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయిన కారణంగా సామాన్యులు మామిడి పళ్లు, కాయలు కొనుగోలు చేసే పరిస్థితి లేదంటున్నారు. పండిన కొద్దిపాటి పంటలో పెట్టుబడి పోను ఎంతోకొంత లాభాలు చేసుకోవాలంటే వ్యాపారులు ధరలు అమాంతం పెంచక తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే సామాన్యుడు ఈసారి మామిడికి దూరమయ్యే పరిస్థితులు కూడా కొట్టిపారేయలేం అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మామిడి రైతులు నిండా మునుగుతారని, నష్టాలు తట్టుకోలేక విపరీతమైన నిర్ణయాలు కూడా తీసుకునే ప్రమాదం లేకపోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకని ప్రభుత్వమే మామిడి రైతుల కోసం ప్రోత్సాహక చర్యలు చేపట్టాలంటున్నారు. మరి సర్కారు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Full View


Tags:    

Similar News