Andhra Pradesh: కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు.. బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్లు..
Andhra Pradesh: దేశంలో అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నా అడవి బిడ్డలకు అభివృద్ధి ఫలాలు అందలేదనే చెప్పొచ్చు.
Andhra Pradesh: దేశంలో అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నా అడవి బిడ్డలకు అభివృద్ధి ఫలాలు అందలేదనే చెప్పొచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన రెండు నెలల చిన్నారి చనిపోతే ఏజెన్సీ ఏరియాకు అంబులెన్స్ ఇవ్వలేమని విశాఖ KGH ఆస్పత్రి చేతులెత్తేసింది. చేసేదిలేక ఆ కన్న బిడ్డ మృతదేహాన్ని 120 కిలోమీటర్ల దూరంలోని తమ స్వగ్రామానికి స్కూటర్‌పైనే తరలించారు. ఈ హృదయవిదారక ఘటన కళ్లారా చూసిన జనం KGH ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడ గ్రామానికి చెందిన దంపతులు తమ రెండు నెలల చిన్నారిని విశాఖ KGHలో చేర్పించారు. ఈ క్రమంలో KGHలో ప్రాణాలు కోల్పోయిన తమ చిన్నారిని స్వగ్రామం తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వమని కోరారు. 120 కిలోమీటర్ల దూరం అంబులెన్స్ ఇవ్వడం కుదరదని KGH సిబ్బంది తెగేసి చెప్పారు. కాళ్లావేళ్లాపడి ప్రాధేయపడినా లాభం లేకపోయింది. ఇక గత్యంతరం లేక చిన్నారి మృతదేహాన్ని ఒళ్లో పెట్టుకుని ఆ దంపతులు స్కూటీపైనే తరలించారు. మార్గమధ్యలో ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ ఏర్పాటు చేసింది.