Somasila Reservoir: సోమశిల జలాశయంలో కుప్పకూలిన శివాలయం
*భారీ వరద ప్రవాహానికి కుప్పకూలిన నదీగర్భంలోని ఆలయం *నేలమట్టమైన రాజగోపురం ప్రధాన ప్రహరీ గోడలు
Somasila Reservoir: సోమశిల జలాశయం నుంచి 12 గేట్ల ద్వారా విడుదలవుతున్న వరద ప్రవాహం జలప్రళయాన్ని సృష్టిస్తుంది. నదీగర్భంలో ఉన్న ప్రధాన శివాలయం ఈ వరద ధాటికి కుప్పకూలింది. రాజగోపురం సహా ప్రధాన ప్రహరీ గోడలు నేలమట్టమయ్యాయి.
వందల ఏళ్ళ నాటి ఈ ఆలయం నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఎన్నో విపత్తులు మరెన్నో వరద పరిస్థితులను ఎదుర్కొన్న ఈ ఆలయం నిన్నటి భారీ వరద తాకిడికి కకావికలమైంది. గర్భగుడి మినహా మిగిలిన ఆలయ ప్రాకారాలు జలప్రళయంలో కొట్టుకుపోయాయి.
అంతేకాదు పెన్నమ్మ ఉగ్ర రూపానికి ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్న సంగమేశ్వర ఆలయం, కోటితీర్థం, జొన్నవాడ కామాక్షి టెంపుల్ మొత్తం వరదల్లో చిక్కుకున్నాయి. శక్తి పీఠాల్లో ఒకటిగా ఉన్న శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షితాయి అమ్మవారి ఆలయం చుట్టూ గత రాత్రి నుంచి వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉగ్ర రూపాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.