Tirupati: తిరుచానూరులో వైభవంగా వరలక్ష్మీ వ్రతం.. ఆకట్టుకున్న వ్రత మండపం
Tirupati: ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించిన పూజారులు
Tirupati: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపంలోని పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.
టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 20 మంది సిబ్బంది, 2 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 20 వేల కట్ ఫ్లవర్స్ తో ఐదు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సుందరంగా అలంకరించారు. ఇందులో తమలపాకులు, ఆపిల్, ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్, మొక్కజొన్న, పైనాపిల్ వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపంపై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామరపూల లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు.