ఏపీలో ఆలయాలపై దాడుల వెనక కుట్ర ఉందా.. వరస పెట్టున ఘటనలెందుకు జరుగుతున్నాయ్?
ఏపీలో ఒకప్పుడు రాజకీయాలు ఫ్యా్క్షనిస్టుల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేవి. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆలయంలోని వెండి సింహాలను ఎత్తుకెళ్తున్నారు. రథాలను దహనం చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో విగ్రహాన్నే ధ్వంసం చేశారు. అసలు ఇది రాజకీయ దురుద్దేశమా మరేవరైనా కావాలనే చేస్తున్నారా అసలు ఏపీలో ఏం జరుగుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై ఎలా రియాక్ట్ అవుతుంది.?
ఏపీలో పాలిటిక్స్ ఆలయాలు చుట్టూ తిరుగుతున్నాయి. గుర్తుతెలియని దుండగులు దొంగతనాలు, విధ్వంసాలతో రెచ్చిపోతున్నారు. ఇక ఈ మధ్య లీడర్లు దేవుళ్లపై సత్యప్రమాణాలకు తెరలేపి రాజకీయాలను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఇదంతా పక్కనే పెడితే తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థంలో బోడికొండపై కొలువైన రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకువెళ్లారు.
మంగళవారం ఉదయం కొండపైకి వెళ్లిన దేవస్థాన అర్చకుడు ప్రసాద్ ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని చూసి నివ్వెరపోయాడు. తోటి సిబ్బందికి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారిస్తామన్నారు జిల్లా ఎస్పీ రాజకుమారి.
కోదండ రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమంటున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. అధికారపార్టీ లోపమని వేలెత్తి చూపుతున్నారు. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఆందోళనకు దిగారు. అయితే విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నందున ప్రభుత్వానికి చెడ్డపేరు ఆపాదించేందుకు ఎవరో కావాలనే విగ్రహాన్ని ధ్వంసం చేశారని అధికార పార్టీ నేతలు వాధిస్తున్నారు.
ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా సీఎం జగన్ స్పందించకపోవడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. రాముడి విగ్రహాన్ని శిరస్సు కనిపించకుండా ధ్వంసం చేసిన విధానం బాధ కలిగించిందని అన్నారు. ఏపీలో ఏడాదిన్నర కాలంగా హిందూ మతంపై ఒక పథకం ప్రకారమే దాడులు జరుగుతున్నాయని పవన్ విమర్శించారు. ఈ ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు పవన్.
ఇదిలా ఉండగా రాముడి విగ్రహ తలభాగం బుధవారం ఉదయం లభ్యమైంది. దుండగులు విగ్రహ తల భాగాన్ని కొలనులో పడేసి వెళ్లారు. గమనించిన అర్చకులు విగ్రహ శకలాన్ని బయటకు తీశారు. దీంతో ఆలయ పరిసరాలు రామనామస్మరణతో మార్మోగాయి. చిన్నజీయర్ స్వామి ఆశ్రమ ప్రతినిధులతో మళ్లీ పునర్: ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరుగుతున్న ఘటనలపై అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.