LockDown in AP: ఏపీలో పెరుగుతున్న లాక్ డౌన్ లు.. ఒంగోలుతో పాటు తుని తదితర ప్రాంతాల్లో
LockDown in AP: కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో కొంతమేరైనా కట్టడి చేసేందుకు మరోమారు లాక్ డౌన్ తెరపైకి తెస్తున్నారు.
LockDown in AP: కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో కొంతమేరైనా కట్టడి చేసేందుకు మరోమారు లాక్ డౌన్ తెరపైకి తెస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులే లాక్ డౌన్ ప్రకటిస్తుండగా, మరికొన్ని చోట్ల వ్యాపారస్తులే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు, రాజమండ్రి, కాకినాడ, తునితో పాటు పలు ప్రాంతాల్లో ఈ లాక్ డౌన్ లు ప్రకటిస్తున్నారు.
నగరంలో కరోనా కేసులు ఉధృతంగా నమోదవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ద్వారా వైరస్ వ్యాప్తికి చెక్ చెక్ పెట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటి వరకు కొన్ని రకాల సడలింపులతో పరిమిత ఆంక్షలు విధిస్తూ వచ్చిన అధికారులు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో కంటైన్‌మెంట్ ఆంక్షలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో నగరపాలక సంస్థ పరిధిలో పటిష్టమైన లాక్‌డౌన్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ పోల భాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి రెండు వారాల పాటు కఠినమైన ఆంక్షలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతించారు.
మెడికల్ షాపులు తెరుచుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. మిగిలిన ఎటువంటి వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తొమ్మిది గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలిచ్చారు. అత్యవసర సేవలకు, విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు విధిగా గుర్తింపు కార్డులను విధిగా వెంట ఉంచుకోవాలి. ఈ నింబంధనలు రెండు వారాలపాటు పక్కాగా అమలు కానున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని కమిషనర్ పిడతల నిరంజన్‌రెడ్డి, ఒంగోలు తహసీల్దార్ కె.చిరంజీవి కోరారు.