కాయ చిన్నదైనా నిమ్మ ఇప్పుడు రూ 5.. పేదవాడికి అందని ద్రాక్షగా మారిన నిమ్మ
Lemon Price: మరొక నెల పాటు ఇంతే అంటున్న వ్యాపారులు.
Lemon Price: అందని ద్రాక్ష పుల్లన అని వెనకటికో సామెత ఉండేది. ధరలు పెరిగే కొద్దీ కొనుగోలు శక్తి సన్నగిల్లిన వినియోగదారులు పది కొనాల్సిన చోట నాలుగుతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.అలా వుంది నేడు మార్కెట్లో నిమ్మకాయల పరిస్థితి. పెద్ద కాయతో నాకు పోటీ ఎన్ని ఊరుకోకుండా పెద్ద గోలీ సైజు అంత నిమ్మకాయ సైతం నా ధర 5 రూపాయలు అంటోంది.సహజంగా నిమ్మ కాయ రూపాయి లేదా రూపాయిన్నర ఉండేది.పూర్తిగా పులుపు లేకపోయినా ధరలో మాత్రం బలుపు చూపిస్తోంది. ఇంకా పసరు వాసనా పోనీ నిమ్మకాయ రాజోలు,ముమ్మడివరం,కాకినాడ ,తుని నియోజకవర్గాల్లో ఎక్కడ కొన్న నిమ్మకాయ ధర రూ.5 నుంచి రూ 8 వరకూ పలుకుతోంది. నెల కిందట 10 రూపాయలకు పది కాయలు ఇచ్చేవారు. ఇప్పుడు పిడికిట్లో సరిపోయేలా రెండు చేతుల్లో పెడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మపంట రాజమహేంద్రవరం సమీపంలో మధురపూడి, గోకవరం తదితర గ్రామాల్లో విరివిగా వుంది.అక్కడ నుంచే కోనసీమ ,కాకినాడ జిల్లాల్లో దాదాపు అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతాయి.
గతంలో 48 కిలోల బస్తా నిమ్మకాయల ధర 1200 రూపాయల నుంచి 1400 రూపాయలు ఉండేది. ఇప్పుడు 4800 రూపాయల నుండి 6000 రూపాయల వరకూ వుంది. దిగుబడి తగ్గడం,చీడ పీడలు, కోల్ కతాకు నేరుగా ఎగుమతి కావడం వంటి కారణాలతో నిమ్మ ధర ఇంతలా పెరిగిందని దుకాణదారులు అంటున్నారు.కాకినాడ జిల్లాలో నిమ్మకాయల దుకాణాలు 800 పైబడి వున్నాయి.ఎక్కడ చూసినా ఇవే రేట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.ఒక నెల పాటు ఇలాగే ధరలు వుంటాయని వ్యాపారులు అంటున్నారు.వేసవి తాపాన్ని తగ్గించేందుకు ఎక్కువగా నిమ్మకాయలు వాడే వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఒకవైపు రంజాన్ ఉపవాసాలు వుండే ముస్లింలు ఎక్కువగా ఈ నిమ్మరసం వాడతారు. కిళ్లి షాప్ లలో అమ్మే నిమ్మ సోడాలకు కూడా దీని అవసరం ఎంతో వుంది.ఒక వైపు కూరగాయల ధరలు,మరొక వైపు నిమ్మ ధరల మోత పడలేక మూడు నాలుగు కాయలు మాత్రమే కొంటున్నారు అని వ్యాపారులు అంటున్నారు. పండించే రైతుకు ఆనందంగా ఉన్నా వినియోగదారులకు మాత్రం నిమ్మ కొనాలంటే,అమ్మో అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే కొబ్బరి కాయ,కొబ్బరి బొండంఇప్పడు నిమ్మకాయ ఏది కొన్నా జేబుకు చిల్లే అని వినియోగదారులు వాపోతున్నారు.