Mutation policy in AP: రిజిస్ట్రేషన్ నెల రోజుల్లో భూ బదలాయింపు హక్కులు.. ఏపీలో మ్యూటేషన్ విధానం అమలు

Mutation policy in AP: ఏ వ్యక్తి అయినా కొంత భూమి కొంటే దానికి సంబంధించిన హక్కు పత్రాలన్నీ ఎవరి ప్రమేయం లేకుండా తహశీల్దారు కార్యాలయం నుంచి నేరుగా..

Update: 2020-07-18 02:37 GMT
Mutation Policy in AP

Mutation policy in AP: ఏ వ్యక్తి అయినా కొంత భూమి కొంటే దానికి సంబంధించిన హక్కు పత్రాలన్నీ ఎవరి ప్రమేయం లేకుండా తహశీల్దారు కార్యాలయం నుంచి నేరుగా అన్ని వెరిఫి కేషన్ ప్రక్రియలు పూర్తిచేసి, మీ భూమి వెబ్ పోర్టల్ నుండి ఈ పాస్ పుస్తకంతో పాటు పలు పత్రాలు పొందేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం కొత్తగా మ్యూటేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికి భూ హక్కుదారు ప్రమేయం లేకుండానే, తహశీల్దారు కార్యాలయాలనికి వెళ్లనవసరం లేకుండానే ఈ ప్ర్రక్రియను పూర్తిచేయడమే మ్యూటేషన్ విధానం. దీనిని ఏపీ ప్రభుత్వం కొత్తగా ఇటీవల ప్రారంభించింది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆటో మ్యుటేషన్‌ విధానం విప్లవాత్మక మార్పు తెచ్చిందనడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే. విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే కొనుగోలుదారుల పేరుతో భూ యాజమాన్య హక్కులు బదలాయించాలని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం సత్ఫలితాలిస్తోంది. గతంలో కొనుగోలుదారులు, వారసత్వంగా, భాగ పరిష్కారం ద్వారా భూమి సంక్రమించిన వారు రెవెన్యూ రికార్డులైన భూ అనుభవ పత్రం (అడంగల్‌), భూయాజమాన్య హక్కు పత్రం (1బి)లో తమ పేర్ల నమోదు కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రెవెన్యూ సిబ్బందికి ముడుపులు ఇవ్వనిదే మార్పులు (మ్యుటేషన్లు) జరిగేవి కావు. ఈ పరిస్థితిని మార్చడం కోసమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు ఆటో మ్యుటేషన్‌ విధానం తెచ్చింది. దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్‌ జరిగిన నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లోని హక్కుదారులు/అనుభవదారుల కాలమ్‌లో కొనుగోలుదారుల పేర్లు నమోదు చేసే ఆటో మ్యుటేషన్‌ ప్రక్రియను గత ఫిబ్రవరి 11న సీఎం లాంఛంగా ప్రారంభించారు. అనంతరం అధికారులు ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు జారీచేశారు.

ఆటో మ్యుటేషన్‌ అంటే..

భూమిని ఎవరైనా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే అమ్మకందారు నిజమైన హక్కుదారేనా? లేక వేరేవారి ఆస్తిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్‌ చేశారా? సదరు ఆస్తిపై వేరెవరికైనా హక్కులు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ జరిపి అన్నీ సక్రమంగా ఉంటే ఆస్తి కొనుగోలుదారు పేరుతో బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనినే ఆటో మ్యుటేషన్‌ అంటారు. ప్రభుత్వం విధించిన నెలరోజుల గడువులోగా అధికారులు ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే.. తహసీల్దారు అంగీకారం లేకపోయినా అంగీకరించినట్లుగానే పరిగణించి కొనుగోలుదారు పేరుతో మ్యుటేషన్‌ పూర్తవుతుంది. దీనినే డీమ్డ్‌ మ్యుటేషన్‌ అంటారు.

ఆటో మ్యుటేషన్‌ అమలు ఎలాగంటే..

► మ్యుటేషన్‌ కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. తహసీల్దారు కార్యాలయం గడప తొక్కాల్సిన పనీలేదు. రిజిస్ట్రేషన్‌ వివరాల ప్రకారం వాకబు చేసి రెవెన్యూ అధికారులు రికార్డులు సవరించాలనేది ప్రభుత్వ విధానం.

► సాధారణంగా సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో నిత్యం వివిధ రూపాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి.

► ఆస్తి రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారి సర్టిఫికెట్లు (ఆధార్‌ కార్డు, వెబ్‌ల్యాండ్‌ డేటా) అన్నీ పరిశీలించి వాస్తవ హక్కుదారులే విక్రయిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాతే సబ్‌ రిజిస్ట్రారు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఏదైనా అనుమానం వస్తే పెండింగ్‌లో పెడతారు.

► ఇలా రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే ఆస్తి యజమాని కాలమ్‌లో అమ్మిన వారి పేరును తొలగించి కొనుగోలుదారు పేరును సబ్‌ రిజిస్ట్రారు నమోదుచేస్తారు.

► తహసీల్దారు ఎస్‌ఆర్‌వో (సబ్‌ రిజిస్ట్రారు ఆఫీసు) లాగిన్‌ ఓపెన్‌ చేయగానే మార్పులు కనిపిస్తాయి.

► వీటిని తహసీల్దారు తాత్కాలికంగా ఆమోదించగానే సదరు ఆస్తి విక్రయ రిజిస్ట్రేషన్‌పై అభ్యంతరాలను ఆహ్వానిస్తూ ఫారం–8 జారీ అవుతుంది. దానిని గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు.

► అభ్యంతరాల సమర్పణకు 15 రోజుల గడువు ఉంటుంది. ఈ సమయంలోనే సచివాలయ సర్వేయరు సదరు భూమిని పరిశీలించి రుసుం చెల్లించిన వారికి సబ్‌ డివిజన్‌ చేసి సరిహద్దులు ఖరారుచేసి మండల సర్వేయరు లాగిన్‌కు నివేదిక పంపుతారు. మండల సర్వేయరు పరిశీలించి ఆమోదిస్తారు.

► 15 రోజుల్లో అభ్యంతరాలు రాని పక్షంలో వీఆర్‌ఓ, ఆర్‌ఐ అదే విషయాన్ని తహసీల్దారు లాగిన్‌కు పంపుతారు. తహసీల్దారు ఆమోదించగానే రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరిగిపోతాయి. మ్యుటేషన్‌ను ఆమోదిస్తూ ఫారం–14 జారీచేస్తారు.

► వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్‌ పూర్తికాగానే కొత్త యజమాని అయిన కొనుగోలుదారులు మీభూమి వెబ్‌ పోర్టల్‌ నుంచి ఇ–పట్టాదారు పాసు పుస్తకం, ఇ–టైటిల్‌ డీడ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

► ఈ మొత్తం ప్రక్రియలో అవకతవకలు, అక్రమాల నియంత్రణకు ప్రభుత్వం ప్రతీదశలోనూ ఆస్తి యజమానులు, కొనుగోలుదారులకు ఎస్సెమ్మెస్‌లు పంపించే విధానం అమలుచేస్తోంది.

రాష్ట్రస్థాయిలో బృందం పర్యవేక్షణ

తహసీల్దార్లు తిరస్కరించిన వాటిని ఆర్డీవో పరిశీలించాలి. అంతేకాక.. రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ఆఫీసులో ప్రత్యేకంగా ఒక బృందాన్ని పెట్టాం. ప్రతి తిరస్కృత మ్యుటేషన్‌ను ఈ బృందం పరిశీలించి నివేదిక ఇస్తుంది. తనది కాని ఆస్తిని వేరేవారు విక్రయించి ఉంటే కచ్చితంగా మ్యుటేషన్‌ను తిరస్కరించడంతోపాటు తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యక్తిపై కేసులు కూడా పెడతాం.

– చెరుకూరి శ్రీధర్, జాయింట్‌ కమిషనర్, సీసీఎల్‌ఏ

Tags:    

Similar News