KRMB: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన
KRMB: పనులను పరిశీలించిన కేఆర్ఎంబీ బృందం
KRMB: ఏపీ ప్రభుత్వం రాయలసీమలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ పరిశీలనలో కేఆర్ఎంబీ పలు ఆసక్తికర అంశాలు గుర్తించింది. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రాజెక్ట్స్ నిర్మాణాలను తనిఖీ చేసింది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు అడుగడుగునా పరిశీలించింది. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సాగిన ఈతనిఖీలో కేఆర్ఎంబీ బృందం అనేక అంశాలను పరిశీలించింది. ఏపీ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వకుండానే ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కూడా కమిటీ పరిశీలించి వాస్తవం తెలుసుకుంది. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సమీపంలో 5 కిలోమీటర్లు లోపల వరకు బృందం వెళ్లి పరిస్థితి సమీక్షించింది.
ఏపీ ప్రభుత్వం కృష్ణా వాటర్ బోర్డుకు సమర్పించిన డీపీఆర్ నివేదికకు ఇక్కడ జరిగే పనులకు తేడా ఉండటం కమిటీ గుర్తించి అసహనం వ్యక్తం చేసింది. పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ వద్ద పెద్ద ఎత్తునే పనులు జరిగినట్టు గుర్తించింది. ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు కృష్ణా రివర్ బోర్డ్ బృందానికి నివేదించిన వివరాలపై పరిశీలన కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏపీ ఇరిగేషన్ అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.
ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద 790 అడుగులకే శ్రీశైలం జలాలను హంద్రీనీవా కు తరలించడం, ఆ సమయంలో 854 నీటి మట్టంతో పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 50 అడుగుల లోతు వరకు కాల్వ ద్వారా 80 క్యూసెక్కు ల నీటిని రోజుకు మూడు టీఎంసీలు ఎస్సార్ఎంసీకి ఎత్తిపోతల ద్వారా తరలించినట్టు కమిటీ పరిశీలనలోకి వచ్చినట్టు తెలిసింది.