Andhra Pradesh: చంద్రబాబు కుప్పం నుంచి పోటీచేస్తే ఓడిపోతాడు: కొడాలి నాని
TDP: అధినేత చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి కొడాలి నాని.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు(chandrababu) గురించి కొత్త విషయాలు చెబుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పంచాయతీ సీట్లను గెలిపించుకోలేని చంద్రబాబు.. ఒక చిత్తు కాగితంలా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు పదవీ వ్యామోహం తప్ప, ప్రజల సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించలేదంటున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు కుప్పం ప్రజలను వదలి హైదరాబాద్ లో తలదాచుకున్నారని విమర్శించారు. అందుకే ప్రజలు బాబు బుద్ధి పసిగట్టారని, గుంటనక్కల ఉన్న బాబును చూసి కుప్పం ప్రజలు అసంహించుకుంటున్నారని ఆరోపించారు.
ఇక 2024లోఅసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఓడిస్తారని కొడాలి నాని జోస్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో బాబు నాలుగు వందల కోట్లు విరాళాలు వసూలు చేశారని ఆరోపించారు. ఇక బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కూడా విమార్శనాస్త్రాలు సంధించారు. సోము వీర్రాజును బీజేపీ(BJP) పార్టీ నేతలే నమ్మడం లేదని, ఇక ప్రజలు ఆయనను నమ్ముతారా అని వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీ నేతలకు అంత శక్తి ఉంటే, స్టీల్ ప్లాంట్ ప్రకటన చేయాలన్నారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కుప్పంలో మొత్తం ౭౪ పంచాయతీలు వైసీపీ కైవసం చేసుకుంది.