ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు

విజయవాడ వాసుల దశాబ్ధాల కల కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది..

Update: 2020-09-05 01:56 GMT

విజయవాడ వాసుల దశాబ్ధాల కల కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న ఫ్లై ఓవర్‌ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొననున్నారు. క‌రోనా నేప‌థ్యంలో కేంద్రమంత్రి గడ్కరీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొంటారని వార్తలు వస్తున్నా.. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమానికి వస్తారంటూ ట్వీట్ చేశారు. కాగా 2013 లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర నివేదిక తయారైంది. అప్పటి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దీనికోసం పోరాటం చేశారు. అయితే ఆ తరువాత 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణం ప్రారంభమైంది.

కానీ కేంద్రం నుంచి నిధులు ఆలస్యం కావడంతో నిర్మాణం పిల్లర్లతోనే ఆగిపోయింది, ఈ క్రమంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి నిధులు ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కేంద్రంపై దుమ్మెత్తిపోశారు. అయితే ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, లాబీయింగ్‌ తో తిరిగి పనులు మొదలుకావడం, ఆ తర్వాత కరోనా కారణంగా పనులు మరోసారి ఆగడం, తిరిగి ఈ మూడు నెలల కిందటే మొదలు కావడంతో ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకుంది. తొలుత ఈనెల 4న క‌న‌క‌దుర్గ వంతెనను ప్రారంభించాల్సి ఉంది. అయితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణించడంతో ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తోంది. దీంతో ప్రారంభోత్సవం ఆలశ్యం అయింది. ఈ క్రమంలో ఈ నెల 18 న ఫ్లై ఓవర్ ను ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.  

Tags:    

Similar News