kadambari Jethwani: కాదాంబరి కేసులో కీలక పరిణామం.. సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్‌లు
kadambari Jethwani case latest news updates: ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీపై వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తప్పుడు కేసులో ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు అధికారులపై వేటు పడింది. ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారకా తిరుమల రావు విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.. ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబసభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై నివేదికను రూపొందించి డీజీపీకి అందజేశారు.
విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్లు సమాచారం. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే ఆయా ఉన్నతాధికారులు తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ బాధిత నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ కేసు దర్యాప్తు నడుస్తోంది.