Kadambari Jethwani: ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిన ఈ కేసులో ఇప్పటివరకూ ఏం జరిగింది?

Kadambari Jethwani: కాదంబరీ జత్వానీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ సీపీ నాయకులు కుక్కల విద్యాసాగర్ ను సెప్టెంబర్ 23న డెహ్రడూన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-09-25 13:19 GMT

Kadambari Jethwani

Kadambari Jethwani: కాదంబరీ జత్వానీ... ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ అయింది. ముంబై నటి జత్వానీపై విజయవాడలో కేసు ఎందుకు నమోదైంది? వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యాసాగర్ కు ముగ్గురు ఐపీఎస్ అధికారులు సహకరించారని బాధితురాలు ఆరోపించారు. దీంతో వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాధితురాలు చేస్తున్న ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో ఒకరైన విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.

కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

కాదంబరీ జత్వానీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ సీపీ నాయకులు కుక్కల విద్యాసాగర్ ను సెప్టెంబర్ 23న డెహ్రడూన్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధించింది కోర్టు.ఈ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

తన భూమిని చిందా వీరవెంకట నాగేశ్వరరాజు, భరత్ కుమార్ లకు విక్రయించేందుకు 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారని విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, తప్పుడు సాక్ష్యాలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించారు. జత్వానీని తాము చూడలేదని నాగేశ్వరరాజు, భరత్ కుమార్ లు చెప్పారు. సాక్షుల కాల్ డేటా ప్రకారంగా వీరిద్దరిని అప్పటి సీఐ విచారించలేదని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వివరించారు.

ముంబై కేసు ఏంటి?

ఓ పారిశ్రామికవేత్త తనపై అత్యాచారం చేశారని జత్వానీ బాంద్రా కర్రా కాంప్లెక్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 2023 డిసెంబర్ 17న ఆ పారిశ్రామికవేత్తపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ఆమె పోలీసులకు సమర్పించాలి. అయితే ఆ సమయంలో ఆమె పోలీసులకు ఆధారాలను సమర్పించలేదు. ఈ ఆధారాలను సమర్పించాల్సిన సమయంలో జత్వానీ విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. దీంతో కోర్టుకు ఆధారాలను సమర్పించలేదని ఆమె చెబుతున్నారు. దీంతో ముంబై పోలీసులు ఈ కేసును క్లోజ్ చేశారు. అయితే దీని వెనుక తెర వెనుక మంత్రాంగం సాగిందని బాధితురాలు ఆరోపిస్తున్నారు.

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో జత్వానీపై కేసు

వైఎస్ఆర్సీపీ నాయకులు కుక్కల విద్యాసాగర్ కు కాదంబరి జత్వానీ మధ్య పరిచయం ఉంది. ముంబైలో జరిగే ఈవెంట్లలో వీరిద్దరూ కలుసుకునేవారు. ఓ ఈవెంట్ మేనేజర్ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఏర్పడిన చనువుతో పెళ్లి చేసుకోవాలని విద్యాసాగర్ జత్వానీని కోరారు. విద్యాసాగర్ కు పెళ్లైన విషయం తెలుసుకున్న ఆమె ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. తన భూమిని జత్వానీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మేందుకు అడ్వాన్స్ తీసుకున్నారని విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఫిబ్రవరి 3న జత్వానీతో పాటు ఆమె పేరేంట్స్ ను అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకు వచ్చారు. ఇదే కేసులో 40 రోజులకు పైగా ఆమె జైలులో ఉన్నారు. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. వీరిపై ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జత్వానీ కేసు అంశం తెరమీదికి వచ్చింది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని బాధితురాలు చంద్రబాబును సోషల్ మీడియాలో కోరారు. జత్వానీ కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. విచారణకు ఆదేశించింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 30న ఆమె విజయవాడకు వచ్చారు. ఈ కేసు దర్యాప్తునకు స్రవంత్ రాయ్ ను విచారణ అధికారిగా నియమించారు. బాధితురాలిని స్రవంతి రాయ్ విచారించారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె వివరించారు. ఆ తర్వాత విజయవాడ సీపీ రాజశేఖరబాబును కలిశారు. ఈ నెల 13న ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 192, 218, 211, 354,220,467,420,471 రెడ్ విత్ 120 బి సెక్షన్ల కింద కేసు చేశారు. ఇదే కేసులో విద్యాసాగర్ ను అరెస్ట్ చేశారు.

ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్

జత్వానీ కేసులో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణా టాటా, అప్పట్లో విజయవాడ డీసీపీగా ఉన్న విశాల్ గున్నీలపై కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తదితరులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.అయితే విశాల్ గున్నీకి అక్టోబర్ 1 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.

ఇప్పుడేం జరుగుతోంది?

జత్వానీపై తప్పుడు కేసు బనాయించేందుకు అసలు సూత్రధారులు ఎవరు, దీన్ని నడిపించింది ఎవరనే విషయాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అప్పట్లో పోలీస్ శాఖలో కీలకంగా పనిచేసిన ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఈ కేసులో విద్యాసాగర్ అరెస్టయ్యారు. కీలకమైన ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.

Full View


Tags:    

Similar News