జనసేన ఎమ్మెల్యే చేష్టలకు అర్థాలే వేరులే.. రాపాక క్షీరాభిషేకంపై జనసేనలో చర్చేంటి?
అతను జగన్ ప్రభంజనాన్ని ఎదురీది గెలిచిన నాయకుడు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయినా, అతను మాత్రం గెలిచాడు. అసెంబ్లీలో జనసేనకు ఒకే ఒక్కడిగా గొంతెత్తుతున్నాడు. అంతాబానే వుంది. కానీ ఆయన జనసేన జెండా పట్టుకుని, వైసీపీ మీద ప్రేమ ఒలకబోస్తున్నాడన్న చర్చ జోరుగా సాగుతోంది. అటు అసెంబ్లీ బయట పవన్ కల్యాణ్, జగన్ సర్కారు మీద కత్తులు నూరుతుంటే, అసెంబ్లీ లోపల జనసేన ఎమ్మెల్యే మాత్రం ప్రశంసలు కురిపించడం, జనసేనలోనే కొత్త కన్‌ఫ్యూజన్‌కు కారణమవుతోంది. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం, ఇప్పుడు కొత్త చర్చను లేవనెత్తింది. ఇంతకీ చిత్రం వెనక అసలు సిత్రమేంటి?
జనసేన ఎమ్మెల్యే ఏంటి జగన్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా ఇప్పుడు ఏపీ మొత్తం అలాగే షాక్ అవుతోంది. నిత్యం ట్వీట్లు, ప్రెస్‌మీట్లు, బుక్‌లెట్లతో జగన్ సర్కారుపై, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడుతుంటే, మరోవైపు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం, జగన్‌కు క్షీరాభిషేకాలు చేస్తుండటం, అందులోనూ వైసీపీ మంత్రితో కలివిడిగా తిరగడం, జనసేన కార్యకర్తలను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేస్తోంది. ఇంతకీ ఎక్కడీ పాలాభిషేకం, సందర్భమేంటి చిత్రం చెబుతున్న సిత్రమేంటి?
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసిపి మంత్రి పినిపే విశ్వరూప్ మంచి స్నేహితులు. ఇప్పుడు పార్టీలు వేరైనా ఆ స్నేహం మాత్రం కొనసాగిస్తున్నారు. ఇటీవల అమలాపురం నియోజకవర్గంలో ఆటో కార్మికులకు, వైయస్ఆర్ వాహన మిత్ర ప్రకటించిన నేపథ్యంలో మంత్రి విశ్వరూప్‌ను ఘనంగా సన్మానించారు. అక్కడ వరకు బాగానే ఉన్నా అదే కార్యక్రమానికి రాజోలు ఎమ్మెల్యే, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ రాపాక వరప్రసాద్ కూడా హాజరయ్యారు. పనిలో పనిగా ఇద్దర నేతలూ కేక్‌ను కట్ చేశారు. ఆటో కార్మికుల కోరిక మేరకు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇదే ప్రస్తుతం రాజకీయవర్గాల్లో కాక రేపుతోంది.
తన సొంత నియోజకవర్గం రాజోలులో, జరిగిన కార్యక్రమానికి రాపాక హాజరైనా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ అమలాపురం నియోజకవర్గానికి వెళ్లి, జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం గతంలో పలుమార్లు సీఎం జగన్‌ను ఆయన ప్రశంసించడం చూస్తుంటే ఆయన అనధికారికంగా వైసీపీలో చేరినట్టేనా అనే ప్రచారం ఊపందుకుంది. దీనికితోడు గడిచిన ఎన్నికల్లో రాపాక గెలుపులో కీలక పాత్ర పోషించిన కెఎస్ఎన్ రాజు, మాజీ ఎమ్మెల్యే అల్లు కృష్ణంరాజు వంటి నేతలు ఇటీవల జనసేనను వీడి, జగన్ సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ ఇద్దరు నేతలతో రాపాక అనుబంధం జిల్లా వాసులందరికీ తెలుసు.
పార్టీ ఫిరాయింపులను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎవరైనా తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సిందేనని కండిషన్ పెట్టారు. అయితే రాపాక రాజీనామా చేయకుండానే పార్టీ మారారన్న ప్రచారం జోరందుకుంది. రాపాకకు అత్యంత సన్నిహితులైన కెఎస్ఎన్ రాజు, అల్లు కృష్ణంరాజులు వైసిపిలో చేరినప్పటికీ, రాపాకకు సన్నిహితులనేది జగమెరిగిన సత్యం. మరోవైపు ఇటీవల జనసేన పార్టీ అంతర్గత సమావేశంలో పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ రాపాక పట్ల దురుసుగా ప్రవర్తించారనే ప్రచారం ఒకవైపు మరోవైపు రాజోలు నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో తనకు ఎదురవుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకొని, రాపాక వైసీపీకి చేరువయ్యేందుకు చూస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది వాస్తవం. రాజోలులో ప్రస్తుతం ఇదే వినిపిస్తోంది. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలంటే, వైసీపీ నేతలతో కలిసి ముందుకు సాగాలని రాపాక నిర్ణయించుకున్నారని సమాచారం. అందుకే ప్రస్తుతం ఆయన అధికారపార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, మరోవైపు జగన్ చిత్రపటానికి సొంత పార్టీ ఎమ్మెల్యే పాలాభిషేకడమే అందుకు నిదర్శనమంటున్నారు పొలిటికల్ పండితులు. చూడాలి, జనసేన ఏకవీరుడు రాపాక వరప్రసాద్, మున్ముందు ఎలాంటి సాహసాలు చేస్తారో, ఈ డేరింగ్ చర్యలను జనసేన అధినేత ఏ కోణంలో చూస్తారో, సమర్థించుకుంటారో, లేదంటే యాక్షన్ తీసుకుంటారో చూడాలి.