Janasena Chief Pawan Kalyan about Coronavirus Outbreak: కోవిద్ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Janasena Chief Pawan Kalyan about Coronavirus Outbreak: కరోనా మహమ్మారి ప్రజలనే కాదు... అధికారులను సైతం బలి తీసుకుంటోంది.

Update: 2020-07-17 04:15 GMT
Pawan Kalyan (File Photo)

Janasena Chief Pawan Kalyan about Coronavirus Outbreak: కరోనా మహమ్మారి ప్రజలనే కాదు... అధికారులను సైతం బలి తీసుకుంటోంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కబళించివేస్తోంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఇలాంటి ఘటనలపై జనసేన అధినేత వపన్ కల్యాణ్ స్పందించారు. వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ కట్టడికి ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నవారిలో కొందరు ఆ మహమ్మారి కాటుకు బలైపోతుండడం చాలా బాధ అనిపిస్తోంది. వైద్యం, పారిశుద్ధ్య, పోలీస్ శాఖలకు చెందిన వారు మృతి చెందడం మనసు కలచివేసే విషాదం. నిన్న మొన్న తిరుపతి, అనంతపురం నగరాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా పని చేస్తున్న ఇద్దరు అధికారులు కోవిడ్ బారినపడి మరణించడం దురదృష్టకరం. అలాగే గుంటూరు జిల్లాలో సీనియర్ వైద్యాధికారితోపాటు, రాష్ట్రంలో ముగ్గురు యువ వైద్య విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూయడం దిగ్భ్రాంతికరం.

కోవిడ్ నిబంధనల కారణంగా మృతి చెందిన వారి పేర్లతో నివాళి అర్పించలేని నిస్సహాయ స్థితి మనది. డిపార్టుమెంటులో మంచి పేరు పొంది, ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ ఇద్దరు పోలీస్ అధికారులు అకాల మరణం చెందడం మాటలకు అందని విషాదం. క్షేత్ర స్థాయిలో పని చేసే ప్రతి ఒక్కరు ఏమాత్రం ఏమరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి అజాగ్రత్త చోటు చేసుకున్నావిలువైన ప్రాణాలను హరించివేస్తుంది. పైస్థాయి అధికారులు సైతం తమ సిబ్బంది ఆరోగ్య భద్రతా విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకోవలసి వుంది. పి.పి.ఈ.కిట్లు, మాస్కులు, శానిటైజర్లు సిబ్బందికి అందుబాటులో ఉంచాలి.

ముఖ్యంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఉదారంగా నష్టపరిహారం అందించాలి. పోయిన మనిషిని ఎలానూ తెచ్చి ఇవ్వలేము కనీసం వారి కుటుంబాలకు వారు లేని లోటు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. విధి నిర్వహణలో అశువులు బాసిన ఇరువురు పోలీస్ అధికారులకు, వైద్యులకు నా తరపున, జనసేన పార్టీ తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

Tags:    

Similar News