మళ్లీ జనంలోకి జనసేనాని.. ఇవాళ, రేపు మంగళగిరిలో కీలక సమావేశాలు
జనసేనాని.. మళ్లీ జనంలోకి వచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.. లాక్‌డౌన్ నిబంధనలు, చాతుర్మాస దీక్ష, సినిమాల హడావుడితో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.
జనసేనాని.. మళ్లీ జనంలోకి వచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.. లాక్‌డౌన్ నిబంధనలు, చాతుర్మాస దీక్ష, సినిమాల హడావుడితో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. జిల్లాల వారీగా నేతలతో సమావేశమై జనాల్లోకి వెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. కొన్ని నెలలుగా హైదరాబాద్ కే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇవాళ, రేపు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బిజీబిజీగా గడపనున్నారు. మరోవైపు అమరావతి రైతులు, మహిళలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కానుండటం.. ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవాళ రేపు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వివిధ జిల్లాల నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలపై సమీక్ష జరపనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్య నేతలతో భేటీ అవుతారు. రేపు తేదీ ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన కొందరు మహిళా రైతులతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత 32 నియోజకవర్గాల నేతలతో సమావేశం అయ్యి.. పార్టీ సభ్యత్వ కార్యక్రమంపై సూచనలు చేస్తారు.
ఏపీలో జనసేన పార్టీ పరిస్థితులపై ముఖ్య నాయకులు నివేదికల రూపంలో ఇచ్చారు. దీంతో ఇప్పటికే సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న పవన్.. రాజకీయ కార్యక్రమాలకు కూడా సమయం కేటాయించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. రాజధాని పై జేఏసీ నేతలకు పవన్ ఎలాంటి భరోసానిస్తారోనని ఎదురు చూస్తున్నారు. జనసేన పార్టీ భవిష్యత్ కార్యచరణ గురించి పవన్ ఎలాంటి ప్రకటన చేస్తారో వేచి చూడాలి..