Fake IPS Officer: పవన్ కళ్యాణ్ టూర్‌లో ఐపీఎస్ అధికారి అంటూ హల్ చల్.. విచారణకు హోంమంత్రి ఆదేశం..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఐపీఎస్(IPS) అధికారినంటూ సూర్యప్రకాష్ (Surya Prakash) అనే వ్యక్తి టూర్ లో హల్ చల్ చేశారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఐపీఎస్(IPS) అధికారినంటూ సూర్యప్రకాష్ (Surya Prakash) అనే వ్యక్తి టూర్ లో హల్ చల్ చేశారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.పవన్ వెంట ఆయన ఎందుకు వచ్చారనే విషయమై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసిన తర్వాత విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూర్యప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సూర్యప్రకాష్ గత ఏడాది తాను ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాయని స్థానికులకు చెప్పారని ప్రచారం సాగుతోంది.
పవన్ కళ్యాణ్ టూర్ లో ఐపీఎస్ అధికారిగా హడావుడి చేసిన ఆయన క్షేత్రస్థాయి సిబ్బందికి ఆర్డర్లు జారీ చేశారు. ట్రాఫిక్ తో పాటు బందోబస్తు విషయంలో క్షేత్రస్థాయి సిబ్బందికి ఆయన సూచనలు ఇచ్చారు. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది ఆయనతో ఫోటో దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. దీనిపై విచారణ జరిపితే సూర్యప్రకాష్ ఐపీఎస్ అధికారి కాదని గుర్తించారు. వెంటనే ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు
ట్రైనింగ్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ టూర్ కు వచ్చానని ఆయన చెబుతున్నట్టుగా తెలుస్తోంది. సూర్యప్రకాష్ గతంలో పార్వతీపురం డివిజన్ లోన తూనికలు, కొలతల విభాగంలో పనిచేశారని పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 20న పార్వతీపురం మన్యం జిల్లాలో(parvathipuram manyam district) పవన్ కళ్యాణ్ పర్యటించారు.సాలూరు నియోజకవర్గంలో 19 రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్ల నిర్మాణాలతో 55 గిరిజన గ్రామాలకు ప్రయోజనం కలుగుతోంది. డోలీ కష్టాల నుంచి గిరిజనులకు విముక్తి లభిస్తుంది.
.ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు పట్టుంది. ఇలాంటి ప్రాంతంలో వీఐపీ పర్యటించే సమయంలో బందోబస్తు విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఐపీఎస్ అంటూ ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ వెంటే తిరిగినా పోలీసులు ఎందుకు గుర్తించలేదని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత
పవన్ కళ్యాణ్ పార్వతీపురం పర్యటనలో భద్రత లోపంపై హోంశాఖ మంత్రి అనిత విచారణకు ఆదేశించారు. వై కేటగిరి భద్రత కలిగిన పవన్ కళ్యాణ్ వెంట నకిలీ ఓ వ్యక్తి ఐపీఎస్ అధికారినంటూ ఎలా వచ్చారో సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు.