జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు చాలా కాలంగా ఎలాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించని పవన్ ఇకపై వరుసగా పార్టీ కీలక నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం దాదాపు 8 నెలల తరువాత ఏపీలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం సినిమాల్లో చాలా బిజీగా ఉన్న పవన్ పార్టీ కోసం రెండు రోజుల సమయాన్ని కేటాయించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కీలక ముందడుగు వేశారు. ఈనెల 17,18 మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సమావేశాలు నిర్వహించనున్నారు. 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరగనుండగా, 18వ తేదీ ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన మహిళా రైతులతో జనసేనాని భేటీ కానున్నారు.
మరోవైపు పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరో 32 నియోజకవర్గాలలో ప్రారంభం కానుంది. పార్టీ సభ్యత్వ నమోదు కోసం పార్టీ ఐ.టి.విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను ఇంఛార్జీలతో కలిసి పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 32 నియోజకవర్గాల ఇంచార్జిలతో బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఈ రెండు సమావేశాలలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
అటు క్రియాశీలక సభ్యులకు పార్టీ అందిస్తున్న ఇన్సూరెన్స్ సౌకర్యానికి సంబంధించి కొందరు సభ్యులకు పవన్ ధ్రువపత్రాలను అందివ్వనున్నారు. మొత్తం మీద చాలా రోజుల తరువాత పార్టీ పై దృష్టి పెట్టిన జనసేనాని ఇక మీదట పార్టీకి సినిమాలకు సమయం కేటాయిస్తూ ముందుకు వెళ్లనున్నారు.