ఏపీ లో రాజకీయాశక్తి గా ఎదగాలంటే జనసేన,బీజేపీ కెమిస్ట్రీ సరిపోదని నాయకులు భావిస్తున్నారా ఇరుపార్టీల నాయకులు ఉమ్మడి కార్యాచరణ కదంతొక్కి ముందుకు వెళ్తే కానీ అధికారపక్షాన్ని ,టీడీపీని ఎదుర్కోలేమా అనే భావన బీజేపీ, జనసేన మిత్రపక్షం అనుకుంటుందా ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
ఏపీలో ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ,జనసేన పార్టీలు.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారా ? లేక జనసేన అభ్యర్థి పోటీ చేస్తారా ? అన్న అంశం తేలకపోయినప్పటికీ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా సత్తా చాటాలని ఇరు పార్టీలు ఉమ్మడిగా నిర్ణయించాయి. ఇదే నేపథ్యంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో బలం చాటితేనే ఆంధ్రప్రదేశ్‌లో తాము బలపడతామనే సంకేతాలు ప్రజలకు ఇవ్వొచ్చని బీజేపీ నమ్ముతోంది. అలా జరగని పక్షంలో ఏపీలో రాజకీయ శక్తిగా ఎదగాలన్న తమ కోరిక తీరడం మరింత కష్టమవుతుందని ఇరు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో మంగళగిరిలోని జనసేనా కార్యాలయంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రావడం ఆసక్తిని రేపుతోంది. జనసేన నాయకులను విజయవాడలోని బీజేపీ కార్యాలయానికి రావాలని ఆహ్వానించారు. ఇరుపార్టీల నేతలు పంచాయతీ ఎన్నికలపైనా మాట్లాడే అవకాశాలున్నాయి.
పంచాయతీ ఎన్నికల విషయంలో బీజేపీ, జనసేన ఏ రకమైన విధానంతో ముందుకు సాగుతాయన్నది ఇంకా తేలలేదు. ఇంకా చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ చేసిన ఈ రెండు పార్టీలకు.. అకస్మాత్తుగా వచ్చినట్టు ఈ పంచాయతీ ఎన్నికలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.