జనసేన పార్టీని వెంటాడుతున్న కష్టాలు.. పార్టీకి గుడ్‌బై చెబుతున్న..

Update: 2020-10-14 11:25 GMT

గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన పార్టీకి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓటమి తర్వాత నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటే జనసైనికులు మాత్రం సేనానికి అండగా నిలిచారు. ప్రస్తుతం వారు కూడా నెమ్మదిగా జారుకుంటున్నారు. జనసేనకు గుడ్‌బై చెబుతున్నారు. పార్టీకి దూరమౌతున్నారు. ఈ పరిణామాలకు కారణం ఎవరు ? పార్టీ చీఫ్‌ పవన్‌ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ? పార్టీని గాడిలో పెట్టడానికి పవన్‌ కళ్యాణ్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ?

జనసేన పార్టీ కాదు ఓ ప్రభంజనం. అన్యాయానికి గురౌతున్న వారి పాలిట ఆశాదీపం. ఎక్కడ న్యాయం ముసుగు వేస్తుందో అక్కడ జనసేన గళం విప్పతుంది. అంటూ ఎన్నో ట్యాగులతో మొదలైన జనసేన పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎవరికీ అర్ధం కావడం లేదు. కష్టాల్లో ఉన్న పార్టీకి కొండంత అండగా బీజేపీ దొరికినా ప్రయోజనం శూన్యం. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పార్టీని, జన సైనికులను నడిపించే నాయకుడు లేకపోవడంతో పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే చాలా మంది నాయకులు,కార్యకర్తలు పార్టీని వీడారు. మిగిలిన ఆ కొద్ది మంది కూడా నెమ్మదిగా పార్టీకి దూరమౌతున్నారు. బీజేపీ కూడా జనసేనను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అంతటా నైరాశ్యం నెలకొంది.

పార్టీ చీఫ్ పవన్‌ కళ్యాన్‌ తీరుపైనా కూడా కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. సేనాని తీరుపై నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా పవన్‌ కళ్యాణ్ బయటకు రాకపోవడం పార్టీ పరమైన కార్యక్రమాలు గాని ప్రజా సమస్యలపై పోరాటాలు గానీ ఏవీ నిర్వహించకపోవడంపై పార్టీ క్యాడర్‌ మొత్తం అసంతృప్తిగా ఉంది. మరో పక్క పవన్‌ కళ్యాన్‌ కూడా బీజేపీ నేత లాగే వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు, నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా మారుతున్న సమీకరణాలు పార్టీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేట్టు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను పార్టీ చీఫ్ పవన్‌ కళ్యాణ్ ఎలా డీల్‌ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News