East Godavari: టైం కాని టైంలో విచ్ఛలవిడిగా కోడి పందెల నిర్వహణ
East Godavari: అర్థరాత్రి వేళ మామిడితోటలో జాతర వాతావరణం * ఎగబడిపోయిన పందెం రాయుళ్లు, వీక్షకులు
East Godavari: ఓ పక్క జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఆసుపత్రులు హౌస్‌ఫుల్ అయ్యాయి. స్మశానాలు నిండిపోతున్నాయి. కరోనా దెబ్బకు జనం గడపదాటాలంటేనే గజగజ వణికిపోతున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం జములపల్లి గ్రామస్తులు ఇవేమి పట్టించుకోవడం లేదు. కరోనా గిరోనా జన్తా నహీ అంటూ రెచ్చిపోతున్నారు. గ్రామంలో కొందరు ఏకమై ఏకంగా కోడిపందెలు నిర్వహించారు. దీంతో పందెం రాయుళ్లు, వీక్షకులు, భక్షకులు ఎగబడిపోయారు. మాస్కులను మరిచిపోయారు. నిబంధనలకు నీళ్లు వదిలేశారు. గుంపులుగా గుంపులుగా చేరి కోడి పందెలను వీక్షించారు.
కరోనా మామిడితోటకు రాదనుకున్నారో ఏమో జములపల్లిలోని కొందరు గ్రామస్తులు గొర్రిఖండి కాలువ మామిడితోటలో వాలిపోయారు. అర్థరాత్రి వేళ ఫ్లెడ్ లైట్స్ పెట్టి మరీ కోడి పందెలను షురు చేశారు. కోళ్లకు కోట్లాట పెట్టి, ఈలల వేసి.. గోల చేశారు. అంతటితో ఆగకుండా గుండాటలు, పేకాటలు అబ్బో సంక్రాంతి వచ్చిదన్నంత సంబురాలు చేశారు. కరోనాకు భయపడి ప్రజలు అన్ని పండుగలను పక్కన పెడుతున్నారు. కానీ జములపల్లిలో మాత్రం కొందరు టైం కాని టైంలో జాతరను తలపించేలా జలసాలు చేశారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఏడుగురు నిర్వాహకులను గుర్తించి కేసులుపెట్టారు.