చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సందడి!
* పశువుల పండుగ కాస్త జల్లికట్టుగా మార్పు * పశువేటగా పశువుల పండుగ * చిత్తూరులో పశువుల పండుగపై ఆంక్షలు
పండుగ అందరికీ ఒకటే అయినా ఊరికో ప్రత్యేకత ఉంటుంది. ప్రాంతానికో రీతిలో పోటీ జరుగుతుంది. ఇవన్నీ పెంపుడు జంతువులతోనే నిర్వహించడంలో ఏదో సాంప్రదాయం దాగుంది. వందల ఏళ్ళనుంచి కొనసాగుతున్న పశువుల పండుగ సంప్రదాయ పోటీ చిత్తూరు జిల్లాకు ఓ ప్రత్యేకత. పాడిపంటలకు ప్రసిద్ధిగాంచిన చిత్తూరులో కనుమరోజున పశువుల పండగ ఓ ప్రతీక.
మాములుగా ఓ పండుగను ఒకరోజు, రెండురోజులు.. మహా అయితే మూడురోజులు జరుపుకుంటారు. కానీ చిత్తూరు ప్రజలు మాత్రం సంక్రాంతి పండుగను నెలరోజులకుపైగా జరుపుకుంటారు. అయితే వీళ్లు కాస్త భిన్నంగా కోళ్ల పందాలు కాకుండా పశువుల పండుగను నిర్వహిస్తారు. తడ నుంచి కుప్పం వరకు ఈ పండుగ వైభవంగా జరుగుతోంది. అయితే పశు సంపద పాల ఉత్పత్తుల కోసమే అన్న విధంగా మారిపోవడంతో సెలబ్రేషన్స్‌లో మార్పులొచ్చినా పశువుల పండుగ మాత్రం ఆగడం లేదు.
తమిళనాడులో జల్లికట్టు ఫేమస్ కావడంతో దాని ప్రభావం జిల్లాపై పడింది. క్రమంగా పశువుల పండుగ కాస్త జల్లికట్టుగా మారింది. చెప్పాలంటే ఇప్పుడు ఇది పశువేటగా మారిపోయింది. ఎందుకంటే జల్లికట్టు మాదిరిలా పోటీల్లో బెట్టింగ్‌లు వేసుకునే స్థాయికి చేరుకుంది. అయితే తమిళనాడులో ఆంక్షలు లేకున్నా చిత్తూరు జిల్లాలో మాత్రం ఈ ఆటపై ఆంక్షలున్నాయి. అయినా జిల్లాలో మాత్రం పోటీలు ఆగిన దాఖలాలు లేవు. ఇక ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిషేదాజ్ఞలు పెట్టినా పందాలు మాత్రం ఆగడం లేదు.
పదునైన కొమ్ములతో జనం మధ్యన వదిలిపెట్టిన ఎద్దులను నిలువరించడం కోసం వస్తాదులవలె అడ్డంగా నిలిచి కోడెగిత్తల మెడల వంచడం ఈ క్రీడ. అయితే ఈ ఆటలో కొందరికి గాయాలైతే కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటారు. అయినా అవన్నీ పట్టించుకోరు. మనిషి మూగజీవాలను మచ్చిక చేసుకోవడం ప్రారంభించినప్పటి నుండి వాటిని తమ అవసరాలకోసం ఉపయోగించుకోవడంతోపాటు వాటితో ఆడుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే పశువుల పండగ ప్రారంభమైందని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.
కోడెగిత్తల పొగరు అణిచేందుకు యువత గ్రూపులు కట్టి ఎద్దులను పట్టి పౌరుషాలను ప్రదర్శిస్తుంటారు. ఈ పందాలు ముఖ్యంగా గిత్తలకు, యువకులకు మధ్య జరిగే బుల్‌ఫైట్ అని చెప్పొచ్చు. గ్రూపుగా ఉన్న యువకులు గుంపులుగా వచ్చే ఎద్దులపై పడి వాటి కొమ్ములకు కట్టిన చిన్నపాటి కలర్ పేపర్ లాగేసుకుంటారు. అదే గెలుపుకు చిహ్నం. యువకుల వీరత్వానికి ప్రతీక. నిజానికి ఓ ఊళ్లో ఈ పండుగ జరుగుతుందంటే పక్కూళ్ల నుంచి పందానికి ఎద్దులతో పాటు యువకులు కూడా వస్తారు.