Chandrababu: జగన్ పని అయిపోయింది... జగన్ ఇంటికి పోయే రోజులు వచ్చాయి
Chandrababu: నా రోడ్ షోలు అంటే జగన్‌కు వణుకు
Chandrababu: ముఖ్యమంత్రి జగన్ పని అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ఇంటికి వెళ్లే టైమ్ దగ్గరకు వచ్చిందన్నారు. కుప్పం పర్యటనలో తనను అడ్డుకోవడంపై చంద్రబాబు భగ్గుమన్నారు. సొంత నియోజకవర్గంలో రాకుండా ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు చట్టబద్ధత ఏముందని ప్రశ్నించారు. ఇప్పటికే చట్టం అమలులో ఉంటే.. జీవో కొత్తగా ఎందుకు తెచ్చారని బాబు ప్రశ్నించారు. రోడ్ షోలకు జనం స్వచ్ఛంధంగా తరలివస్తున్నారని అందుకే జగన్ కు భయం, వణుకు పుట్టిందన్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే ఖబడ్ధార్ మీ ఆటలు సాగనివ్వబోమన్నారు చంద్రబాబు. ఏ చట్టం ప్రకారం సొంత నియోజకవర్గానికి రానివ్వడం లేదని ఏ చట్టం ప్రకారం నా రోడ్ షోను ఆపారో చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు. డీఎస్పీ తనను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసుకొమ్మంటున్నారని ఓ ప్రతిపక్ష నేతతో అలాగే మాట్లాడతారా అని భక్కుమన్నారు బాబు. 5 కోట్ల మంది ప్రజలు ఏకమైతే జగన్ పారిపోవడం ఖాయమన్నారు. పోలీసులకు ధైర్యం ఉంటే బాబాయ్ ను ఎవరు చంపారో తేల్చాలని బాబు డిమాండ్ చేశారు.అంతకు ముందు కుప్పం చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్ షో, ర్యాలీకి అనుమతిలేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు కారునుంచి కిందకు దిగి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. బాబును ముందుకు కదలనివ్వకపోవడంతో ఓ దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇలాంటి చౌకబారు పనులు చేస్తున్నారని జీవో 1ను ఏ చట్ట ప్రకారం తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పాత చట్టం ప్రకారం అయితే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ జీవో పనిచేయదన్నారు. దాన్ని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో తారీఖుతో జీవో ఇచ్చి మొదటి తారీఖున అమలు చేశారంటే డీజీపీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారో అర్ధమవుతోందన్నారు బాబు.