Raptadu Siddam Sabha: ఇవాళ రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ.. హాజరుకానున్న సీఎం జగన్
Raptadu Siddam Sabha: 250 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేసిన వైసీపీ
Raptadu Siddam Sabha: ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న అధికార వైసీపీ సిద్ధం క్యాడర్ మీటింగ్స్‌తో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను చేరుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వైనాట్ 175 నినాదంతో దూసుకెళ్తోన్న జగన్ వరుసగా సిద్ధం సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే రెండు సభలను నిర్వహించిన అధికార వైసీపీ.. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో సభ నిర్వహణకు సిద్ధమైంది. సీఎం జగన్ హాజరుకానున్న ఈ సభకు 250 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. భారీ వేదికతో పాటు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక సిద్ధం సభ నేపథ్యంలో భారీ ర్యాలీకి సిద్ధమైంది వైఎస్సార్‌సీపీ. పదిలక్షల మంది వైసీపీ మద్దతుదారులతో ర్యాలీని నిర్వహించాలని భావిస్తోంది. రాప్తాడు సిద్ధం సభకు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్యకర్తలు, నేతలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ సభ నుంచే ప్రచార గీతాన్ని కూడా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదంతో ఈ పాట ఉండనున్నట్టు తెలుస్తోంది. గతంలో రావాలి జగన్.. కావాలి జగన్ పాట రికార్డులను బద్దలు కొట్టేలా కొత్త ప్రచార గీతం రూపొందించామని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రచార గీతంతో పాటు వచ్చే ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ మేనిఫెస్టోను కూడా సీఎం జగన్ విడుదల చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని సరికొత్త పథకాలను నవరత్నాల క్రింద జోడించి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలున్నాయి.