ఒకే వేదికపై కనిపించనున్న సీఎం జగన్, చంద్రబాబు
G20 Summit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఒకే వేదికను పంచుకోబుతున్నారు.
G20 Summit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఒకే వేదికను పంచుకోబుతున్నారు. ఉప్పునిప్పులా ఉన్న ఈ ఇద్దరు నేతలు ప్రధాని అధ్యక్షతన జరగనున్న జీ-20 సన్నాహక భేటీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో వచ్చే నెల 5న ప్రధాని అధ్యక్షతన G-20 సన్నాహక సమావేశం జరగనుంది. సన్నాహక సమావేశానికి సీఎం జగన్, చంద్రబాబుకు ఆహ్వానం అందింది. రాజకీయ పార్టీల అధ్యక్షులుగా ఈ ఇద్దర్నీ రమ్మని పిలుపువచ్చింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగే భేటీలో జగన్, చంద్రబాబు వేదిక పంచుకోనున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి ఇద్దరు నేతలకు ఆహ్వానం వచ్చింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇరువురికి ఫోన్ చేయడంతో పాటు ఆహ్వాన లెటర్ పంపించారు.
ఇటీవల 75వ స్వాతంత్ర వేడుకల నిర్వహణ కమిటీ భేటీకి వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోడీతో వేదిక పంచుకున్నారు. ఈ నెల 12న విశాఖ పర్యటనలో ప్రధానితో సీఎం జగన్ వేదిక పంచుకున్నారు. ఢిల్లీలో జరిగే సమావేశంలో ప్రధానితో భేటీకి జగన్, చంద్రబాబు హాజరవుతుండటం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలోనూ జగన్, చంద్రబాబు కనిపించారు. ఈ ఇద్దరు నేతలు ఏ వేదిక పంచుకున్నా పలకరింపులు కనిపించవు. మరి ఈసారైనా ఢిల్లీ వేదికగా ప్రధాని మోడీ సమక్షంలో జరిగే భేటీలో పలకరింపులు కరచాలనం విషెస్ లాంటివి ఏవైనా ఉంటాయా అనే చర్చ జరుగుతోంది.