Andhra Pradesh: రాష్ట్రంలో లోకేశ్ 'రెడ్ బుక్' పాలన నడుస్తోందా? వైఎస్ జగన్ ఆగ్రహానికి కారణమేంటి?

ఆగస్టు 22న పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న లీగల్ సెల్ విభాగం సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం

Update: 2024-08-25 10:04 GMT

Andhra Pradesh: రాష్ట్రంలో లోకేశ్ 'రెడ్ బుక్' పాలన నడుస్తోందా? వైఎస్ జగన్ ఆగ్రహానికి కారణమేంటి?

ఆంధ్రప్రదేశ్ లో అరాచకపాలన సాగుతుందని ఎవరికి వారే రెడ్ బుక్ లు తెరిచి విధ్వంసానికి పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు తెరతీశాయి. కక్షసాధింపు చర్యలకు తాము పాల్పడడం లేదని చట్టపరంగానే వ్యవహరిస్తున్నామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజారెడ్డి రాజ్యాంగం అంటూ టీడీపీ నాయకులు విమర్శలు చేశారు.


 ఏమిటీ రెడ్ బుక్? జగన్ ఆరోపణలేంటి?

ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరిపై కేసులు పెట్టాలి,ఎవరిని తొక్కాలనే అంశాలపై టీడీపీ నాయకులు రెడ్ బుక్స్ తయారు చేసి అరాచకాలు చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. పై స్థాయాలో ఉన్నవారు దొంగ కేసులు పెడుతూ విధ్వంసానికి పాల్పడుతుంటే కిందిస్థాయిలోనూ ఎవరికి వారే రెడ్ బుక్ లు తెరిచి విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని... బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. ఆగస్టు 22న పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న లీగల్ సెల్ విభాగం సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ పై చర్చకు తెరలేపాయి.


రెడ్ బుక్ కథ అలా మొదలైంది...

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొందరు అధికారులు వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ నాయకులు విమర్శించారు. ప్రధానంగా క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసులు, ఇతర శాఖల అధికారులు, కొందరు ఐఏఎస్, కొందరు ఐపీఎస్ అధికారులు వైఎస్ఆర్ సీపీ చెప్పినట్టుగా టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారని ఎన్నికల ముందు లోకేశ్ ఆరోపించారు.

ఇలా అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసులతో పాటు వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఉన్న అధికారుల పేర్లను రెడ్ బుక్ లో నోట్ చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. పాదయాత్ర సందర్భంగా ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. ఈ బుక్ లో పేర్లున్న అధికారులపై అధికారంలోకి రాగానే జ్యుడిషీయల్ విచారణ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లున్నాయి.... ఆ ప్రకారమే అధికార పక్షం వేధింపులకు పాల్పడుతోందని ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తోంది.


రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని లోకేష్ పై సీఐడీ ఫిర్యాదు

యువగళం ముగింపు సందర్భంగా రెడ్ బుక్ లో అధికారుల పేర్లు రాశామని లోకేష్ బెదిరింపులకు దిగారని ఏపీ సీఐడీ అధికారులు అప్పట్లో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారనే కేసులో లోకేష్ పై అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

తమపై అక్రమ కేసులు పెట్టే అధికారుల పేర్లను రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నట్టు చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో ఏపీ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. రెడ్ బుక్ పేరు చెప్పి అధికారులను బెదిరిస్తున్నారని లోకేష్ పై సీఐడీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని అప్పట్లో ఏపీ పోలీసు అధికారుల సంఘం లోకేష్ పై విమర్శలు చేసింది.


 వైసీపీ నాయకుల మీద కేసులు... టీడీపీ ఏమంటోంది?

ఎన్ డీ ఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సీపీకి చెందిన నాయకులపై కేసులు తెరమీదికి వచ్చాయి. గతంలో టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తులు ప్రారంభించారు.

గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ ఫిర్యాదుపై దర్యాప్తులో వేగం పెరిగింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.

చంద్రబాబు ఇంటి వద్ద దాడి చేశారనే ఆరోపణలపై అప్పట్లో జోగి రమేష్ పై ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి పోలీసుల విచారణకు హాజరయ్యారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్దం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు.

గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తులు ప్రారంభించారని సైకిల్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కక్షపూరితంగా తాము కేసులు నమోదు చేయడం లేదంటున్నారు. అయితే ఈ వాదనలను వైఎస్ఆర్ సీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు.

అక్రమ కేసులే కాదు తమ పార్టీకి చెందిన నాయకులపై దాడులు, హత్యలకు దిగుతున్నారని జగన్ పార్టీ ఆరోపిస్తోంది. అధికార మార్పిడి జరిగిన తర్వాత రాష్ట్రంలో 36 మంది వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలను హత్య చేశారని జగన్ ఆరోపించారు.

దీనికి నిరసనగా జూలై 24న జగన్ దిల్లీలో ధర్నా చేశారు. అయితే జగన్ ఆరోపణలను చంద్రబాబు కొట్టిపారేశారు. 36 మంది హత్య జరిగితే ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లు ఏమయ్యాయని సీఎం అసెంబ్లీ వేదికగానే జగన్ కు సవాల్ విసిరారు.

అప్పుట్లో రాజారెడ్డి రాజ్యాంగం?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శలు చేశారు. టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని కేసులు, దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ విమర్శలు చేశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి వారిపై జగన్ సీఎంగా ఉన్న సమయంలో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులు కక్షపూరితంగా నమోదు చేసినవేనని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను వైసీపీ కొట్టిపారేసింది.

ప్రజలు అధికారాన్ని ఇచ్చింది సంక్షేమం, అభివృద్ది చేసేందుకేనని కక్షసాధింపు కోసం కాదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఉపేక్షించమని చెబుతూనే వాటిపై చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

ఏది ఏమైనా... ఏపీలో రాజకీయ దాడులు ఎక్కడపడితే అక్కడ జరుగుతున్నాయన్నది కాదనలేని వాస్తవం. రాజకీయ కక్షలతో కొనసాగేదాడులు రాష్ట్రంలో హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తాయి. అమరావతి, అభివృద్ధి అంటున్న చంద్రబాబునాయుడుకు ఈ వాతావరణం ఏమాత్రం కలిసివచ్చేది కాదు.

Tags:    

Similar News