టీటీడీ నూతన 'ఈవో'గా ఐఏఎస్ అధికారి కెఎస్ జవహర్ రెడ్డి..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కెఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కెఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జవహర్‌రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం తన శాఖ నుంచి రిలీవ్ కానున్నారు. ఇవాళ సాయంత్రం లేదంటే రేపు ఉదయం జవహర్ రెడ్డి టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఇటీవలే బదిలీ అయ్యారు. మూడేళ్లకుపైగా టీటీడీ ఈవోగా పనిచేసిన సింఘాల్ పదవీకాలం 2019 లోనే పూర్తయింది. కానీ జగన్ ప్రభుత్వం మరో ఏడాది పదవీకాలాన్ని పొడిగించింది.
అనంతరం బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం 2020 సెప్టెంబరు 30న అనిల్ సింఘాల్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ధర్మారెడ్డికి అదనపు ఈవోగా బాధ్యతలు అప్పజెప్పింది. దాదాపు పదిరోజుల పాటు ఆయన తాత్కాలిక ఈవోగా పనిచేశారు. తాజాగా జవరహర్ రెడ్డిని పూర్తి స్థాయి ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ధర్మారెడ్డి అదనపు ఈవోగా కొనసాగనున్నారు. ఇదిలావుంటే అక్టోబర్ 2నే టీటీడీ ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయిన అనిల్ కుమార్ సింఘాల్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా రేపు లేదా ఎల్లుండి పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.