శ్రీశైలం ముక్కంటి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. శివనమస్మరణతో మారుమోగుతున్న మలన్న క్షేత్రం
Srisailam: పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్న భక్తజనం
Srisailam: కార్తీకమాసం చివరి సోమవారం ఈరోజుతో ముగుస్తుండటంతో శ్రీశైల ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా క్షేత్రానికి తరలివచ్చారు. శ్రీస్వామి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ లో పాలు, బిస్కెట్లు, అల్పాహారం అందిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. చివరి కార్తీక సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రధానాలయం ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద ఈ రోజు దేవస్థానం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు.