Tirupati Laddu: తిరుపతి లడ్డు ఎలా తయారు చేస్తారు, ఇందులో జంతువుల కొవ్వు కలిపారా?

వేంకటేశ్వరస్వామికి తొలిసారిగా 1715 ఆగస్టు 2 న లడ్డూను నైవేద్యంగా సమర్పించారని చరిత్ర చెబుతోంది. అయితే, శ్రీవారి ఆలయంలో లడ్డూల విక్రయం మాత్రం 1803లో మొదలైంది. తొలతు దీన్ని బూందీ రూపంలో ప్రసాదంగా విక్రయించేవారు. కాలక్రమంలో అంటే 1940 నాటికి లడ్డూల తయారీ ప్రారంభమైంది.

Update: 2024-09-20 15:29 GMT

Tirupati Laddu: తిరుపతి లడ్డు ఎలా తయారు చేస్తారు, ఇందులో జంతువుల కొవ్వు కలిపారా?

తిరుపతి లడ్డూకు 309 ఏళ్ల చరిత్ర ఉంది. దీనికి పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. 2014లో భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది. కచ్చితమైన కొలతలతో వీటిని తయారు చేస్తారు. రుచిలో ఈ లడ్డూ ప్రత్యేకం. దీని తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన దుమారం రేపింది. ఈ ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తోసిపుచ్చారు. ఈ వివాదం ఏమిటో తెలుసుకునే ముందు, తిరుపతి లడ్డు ప్రత్యేకత ఏంటి, దాని చరిత్ర ఏంటన్నది తెలుసుకుందాం.

తిరుమల లడ్డూ చరిత్ర

వేంకటేశ్వరస్వామికి తొలిసారిగా 1715 ఆగస్టు 2 న లడ్డూను నైవేద్యంగా సమర్పించారని చరిత్ర చెబుతోంది. అయితే, శ్రీవారి ఆలయంలో లడ్డూల విక్రయం మాత్రం 1803లో మొదలైంది. తొలతు దీన్ని బూందీ రూపంలో ప్రసాదంగా విక్రయించేవారు. కాలక్రమంలో అంటే 1940 నాటికి లడ్డూల తయారీ ప్రారంభమైంది.

తిరుపతికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాన్ని తిరుప్పొంగం అని పిలిచేవారు. సుఖీయం, అప్పం, వడ,అత్తిరసం, మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టినట్టు గా శాసనాలు చెబుతున్నాయి. అయితే వీటిలో వడ మినహా మిగిలినవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. దూర ప్రాంతాలకు ఈ ప్రసాదం తీసుకెళ్లే భక్తులు ఇబ్బంది పడేవారు. దీంతో అప్పట్లో వడకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే లడ్డూ తయారీని ప్రారంభించినట్టు గా చెబుతారు.

లడ్డూ తయారీ ఎలా చేస్తారు?

లడ్డూ తయారీలో ఏ పదార్థం ఎంత మోతాదులో వాడాలో తెలియజేసే దాన్ని దిట్టం అంటారు. దీని ప్రకారమే శనగ పిండి, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, చక్కెర, ఎండుద్రాక్షలు, కలకండ ఉపయోగిస్తారు. 1950 లో మొదటిసారిగా లడ్డూ ల తయారీ కోసం దిట్టం నిర్ణయించారు. అయితే తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో దిట్టంలో కూడా మార్పులు చేశారు. చివరిసారి 2001 లో దిట్టం నిర్ణయించారు. దీని ప్రకారమే ప్రస్తుతం లడ్డూల తయారీ జరుగుతోంది.

దిట్టం ప్రకారం 5,100 లడ్డూల తయారీకి 803 కిలోల ముడి సరుకులు వాడుతారు. శనగ పిండి 180 కిలోలు, ఆవు నెయ్యి 165 కిలోలు, చక్కెర 400 కిలోలు, జీడిపప్పు 30 కిలోలు, ఎండు ద్రాక్ష 16, కలకండ 8 కిలోలు, యాలకులు 4 కిలోలు ఉపయోగిస్తారు.

తొలుత శనగ పిండిని బూందీకి అనువుగా చక్కెరతో కలుపుతారు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సలసల కాగే నెయ్యిలో వేసి బూందీగా తయారు చేస్తారు. కాగుతున్న కడాయి నుంచి బూందీని వేరు చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆలయంలోకి పంపుతారు. అనంతరం జీడిపప్పు, ఎండుద్రాక్ష, కలకండ, యాలకులు, బాదంపప్పు, కుంకుమపువ్వు కలిపి లడ్డూను తయారు చేస్తారు. గతంలో లడ్డూలను కట్టెల పొయ్యిమీద చేసేవారు. ప్రస్తుతం ఆవిరి పొయ్యిలను వాడుతున్నారు. సుమారు 700 మంది పోటు కార్మికులు లడ్డూ తయారీలో పనిచేస్తున్నారు. ప్రతి రోజూ 3.20 లక్షల లడ్డూలు తయారు చేస్తారు.

మూడు రకాల లడ్డూలు

తిరుమల లడ్డూల్లో మూడు రకాలున్నాయి. తిరుపతికి వచ్చే భక్తులకు విక్రయించేవి సాధారణ లడ్డూలు. దీంతో పాటుగా ఆస్థాన, కళ్యాణోత్సవ లడ్డూలు కూడా ఉన్నాయి. ప్రత్యేక సందర్భంలో తయారు చేసి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇచ్చే లడ్డూలను ఆస్థాన లడ్డూలుంటారు. దీని బరువు 750 గ్రాములు. ఇందులో నెయ్యి, సారపప్పు, ముంతమామిడిపప్పు, కుంకుమపువ్వు, ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు.

కల్యాణోత్సవం ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదంగా ఇచ్చే లడ్డూలను కళ్యోణోత్సవ లడ్డూలుగా చెబుతారు. దీని బరువు 700 గ్రాములు. కళ్యాణోత్సవం సహా మరికొన్ని సేవల్లో పాల్గొన్న భక్తులకు మాత్రమే వీటిని ఇస్తారు. ప్రస్తుతం కౌంటర్లలో కళ్యాణోత్సవం లడ్డూలను కూడా అమ్ముతున్నారు. దీని ధర 200 రూపాయాలు. ఇక సాధారణ లడ్డూ. దీన్ని ప్రోకం లడ్డూ అని కూడా పిలుస్తారు. సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందిస్తారు. కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా ఇస్తారు. దీని బరువు 175 గ్రాములు.

నందిని నెయ్యి ప్రత్యేకత ఏంటి?

నందిని నెయ్యిని తిరుపతి లడ్డూ తయారీలో 2023 వరకు ఉపయోగించారు. 50 ఏళ్లుగా ఇదే నెయ్యిని వాడుతున్నారు. నందిని నెయ్యిని ఆవు పాలతో సంప్రదాయ పద్దతిలో తయారు చేస్తారు. ఈ నెయ్యికి అగ్ మార్క్ సర్టిఫికెట్ కూడా ఉంది. దీని ధర కూడా ఎక్కువే. కర్ణాటకలో నందిని నెయ్యి 200 మిల్లీలీటర్లకు 155 రూపాయలు.2023లో కర్ణాటక ప్రభుత్వం నందిని పాల ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నెయ్యి ధరలు కూడా పెరిగాయి. ఆ తర్వాత జరిగిన టెండర్ ప్రక్రియలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల్గొనలేదు. 2021 మార్చి లో జరిగిన టెండర్ ప్రక్రియలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దాఖలు చేసిన టెండర్ ఎల్ -3 గా నిలిచింది. అయితే ఎల్ -1, ఎల్ -2 అనుమతితో ఈ సంస్థ 20 శాతం నెయ్యిని సరఫరా చేసింది.

తిరుపతి లడ్డూపై తాజా వివాదం ఏంటి?

లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 18న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. బాలాజీకి ప్రసాదంగా ఉపయోగించే లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

ల్యాబ్ రిపోర్ట్ లో ఏముందంటే?

లడ్డూ తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యి నాణ్యంగా లేదనే అనుమానంతో దాన్ని టెస్ట్ చేయించితే ఇందులో కల్తీ జరిగిన విషయం బయటకు వచ్చిందని టీటీడీ ఈవో శ్యామల రావు చెప్పారు.

నెయ్యి శాంపిల్స్ ను గుజరాత్ ఆనంద్ లోని ఎన్ డీడీబీ ల్యాబ్ లో పరీక్షిస్తే నాణ్యత 100 పాయింట్లకు బదులు 20 పాయింట్లే ఉందని... ఇందులో జంతువుల కొవ్వు కలిపినట్టుగా ఈ రిపోర్ట్ బయటపెట్టిందని ఆయన తెలిపారు.

కట్టుకథ అంటూ కొట్టిపారేసిన జగన్

లడ్డూ తయారీ కోసం ఉపయోగించే నెయ్యి నాణ్యతను మూడుసార్లు పరీక్షిస్తారని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మూడు టెస్టుల్లో పాసైతేనే ఆ ట్యాంకర్ ను టీటీడీ అనుమతిస్తుందన్నారు. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల అవశేషాలు అనేది ఓ కట్టుకథగా ఆయన కొట్టి పారేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం న్యాయమా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.

అపచారం జరిగింది

తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో అప్పటి టీటీడీ ఛైర్మన్, ఈవోల దృష్టికి తీసుకెళ్లానని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెప్పారు. ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో ఉపయోగించడం అపచారమన్నారు. వ్యక్తిగత కారణాలతో ఇతర అర్చకులు అప్పట్లో తనతో కలిసి రాలేదని ఆయన చెప్పారు.

చంద్రబాబుకు వైవీ సుబ్బారెడ్డి సవాల్

లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చేసిన ఆరోపణలను నిరూపించాలని టిటిడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబుకు సవాల్ చేశారు. ఈ విషయమై వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబు సిద్దంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.

లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును ఉపయోగించారనే అంశం వెలుగులోకి రావడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ విషయమై సమగ్రంగా విచారణ జరపాలని భక్తులు కోరుతున్నారు. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News