ఆశల పల్లకిలో పల్లెలు.. అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామ సభల్లో తీర్మానాలు

*గ్రామ వ్యవహారాలు చూస్తున్న పంచాయతీ కార్యదర్శులు *సమస్య పరిష్కారానికి అధికారుల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి *అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామ సభల్లో తీర్మానాలు

Update: 2021-02-01 03:30 GMT

ఆశల పల్లకిలో పల్లెలు.. అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామ సభల్లో తీర్మానాలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. అటు ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరైన నాయకుడిని ఎన్నుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని సంతోష పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల సందడి నేపథ్యంలో పల్లెల పరిస్థితులపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ ఫోకస్‌.

పంచాయతీ ఎన్నికలకు నగారా మోగడంతో పల్లెలు కళకళలాడుతున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌లో ఎన్నికల సంబరాలు మొదలయ్యాయి. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఏ తలుపు తట్టినా సమస్యలే దర్శనమిచ్చేవి. ప్రధానంగా తాగునీటి, పారిశుద్ధ్య సమస్య గ్రామాలను పట్టిపీడుస్తున్నాయి. దీనికి తోడు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే సరైన రహాదారులు లేవు. దీంతో గ్రామాల అభివృద్ధి వెనకబడిపోయింది.

 కొన్నేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీ కార్యదర్శి గ్రామ వ్యవహారాలను చూసేవారు. దీంతో గ్రామాల అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. అటు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి అధికారుల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సమస్య పరిష్కారం కోసం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. చెప్పాలంటే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలంటే గ్రామ సభలు నిర్వహించి తీర్మానం చేసుకునేవారు.

పంచాయతీ ఎన్నికలు దగ్గరపడటంతో గ్రామాల్లోని ప్రజలు రచ్చబండ దగ్గరకు చేరుకుని సమర్ధవంతమైన సర్పంచ్‌ని ఎన్నుకుందామనే ఆలోచన చేస్తున్నారు. ప్రధానంగా అనకాపల్లి మండలంలోని తమ్మపాలెం, వెంకుపాలెం తదితర గ్రామాల్లోని ప్రజలు ఎన్నికల జాప్యం కారణంగానే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ సమస్యలు పరిష్కరించే సర్పంచ్‌లనే ఎన్నుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

 మొత్తానికి ఎన్నికల పుణ్యమా అని పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని జనాలు ఆనందపడుతున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలకు ఓ పరిష్కారం దొరుకుతుందని సంబరపడిపోతున్నారు.

Tags:    

Similar News