హీట్ పెంచుతున్న ఏపీ లోకల్ ఫైట్
ఏపీలో లోకల్ ఫైట్ హీట్ పెంచుతోంది. మొన్నటి దాకా కరోనాతో కాస్త వెనుకపడ్డ అంశం ఇప్పుడు వేడి పుట్టిస్తోంది. అఖిలపక్ష భేటీతో పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్... ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి పెంచుతోంది.
ఏపీలో లోకల్ ఫైట్ హీట్ పెంచుతోంది. మొన్నటి దాకా కరోనాతో కాస్త వెనుకపడ్డ అంశం ఇప్పుడు వేడి పుట్టిస్తోంది. అఖిలపక్ష భేటీతో పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్... ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి పెంచుతోంది. ఈ భేటీకి అధికార పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా హాజరుకాకపోవడం చెప్పుకోదగ్గ విషయం. అయితే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశమే లేదని వైసీపీ వాదిస్తుందటే... పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్తగా విడుదల చేయాలంటూ తెలుగుదేశం మినహా అన్ని పార్టీలు ఏకకంఠంతో చెబుతున్నాయ్. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం ఏంటి.. ప్రభుత్వం తీసుకోబోయే చర్యలేంటి? ఈ ఈగోల మధ్య, ఈ కొట్లాల నడుమ స్థానిక సంస్థలు సజావుగా జరుగుతాయా? జరగాలంటే ఎవరు ఏం చేయాలి? ఇదే ఇవాళ్టి స్పెషల్ ఫోకస్.
కరోనా మహమ్మారి విజృంభణతో ఒకసారి స్ధానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. దీంతో ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపీ సర్కారు ఆగ్రహం పెంచుకుంది. ఆయన్ను ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ పదవి నుంచి తొలగించింది. హైకోర్టు ఉత్తర్వులతో నిమ్మగడ్డ ఎస్‌ఈసీ పదవిలోకి వచ్చారు. ఇక్కడే ఇటు ఈసీ, అటు సర్కార్ ఈగోలు పెంచుకున్నాయి. నిమ్మగడ్డ ఆధ్వర్యంలో స్ధానిక ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా లేమంటూ తేల్చిచెప్పింది. కరోనా మాములుగా ఉన్న రోజుల్లోనే ఎన్నికలు వద్దంటూ వాయిదా వేసిన ఈసీ- కరోనా ఇంత విజృంభిస్తున్న వేళ ఎన్నికలు ఏంటంటూ నిమ్మగడ్డకు చురకలంటిస్తోంది. ఈ సమయంలోనే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ అఖిలపక్షాలను భేటీకి ఆహ్వానించారు.
అఖిలపక్ష భేటీలో ఒక్కొక్కరు ఒక్కో విధమైన అభిప్రాయాన్ని చెప్పారు. వివాదాలకు తావులేకుండా.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని పార్టీలన్నీ కోరినా... ఒక్కో పార్టీ ప్రత్యేకమైన తన విధానాన్ని చెప్పింది. ఎవరెవరు ఏమన్నారో ఒకసారి చూద్దాం.
కొంతకాలంగా ఏపీలో జరిగిన హాట్‌టాపిక్ అంశాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్యూ కూడా ఒకటి. స్థానిక సంస్థల ఎన్నికలను తమతో సంప్రదించకుండా వాయిదా వేశారని గుర్రుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, మీడియా ముందుకు వచ్చి మరీ నిమ్మగడ్డపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకువచ్చి నిమ్మగడ్డను తొలగించి జస్టిస్ కనగరాజ్‌ను నియమించారు. ఆ తర్వాత ఇష్యూ కోర్టు పంచన చేరింది. మూడు నెలల పాటు కోర్టుల చుట్టూ తిరిగిన ఈ ఎపిసోడ్, చివరకు గవర్నర్ జోక్యంతో ఓ కొలిక్కి వచ్చింది. అప్పటి నుంచీ నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వం అన్నంతగా సీను మారిపోయింది.