ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై అదే ఉత్కంఠ.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై అదే ఉత్కంఠ. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన అదే అస్పష్టత. ఎస్‌ఈసీ- ప్రభుత్వం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆదేశాలు, ధిక్కరణలు, కోర్టుల్లో కేసుల దశను దాటి నామినేషన్ల రోజూ వచ్చింది. కానీ నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఎలాంటి సన్నాహాలు చేయలేదు. అసలు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందలేదు. మరి నామినేషన్ల ఘట్టంలో తొలి రోజైన ఇవాళ ఏం జరగబోతోందనన్న ఉత్కంఠ నెలకొంది.
ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తొలి దశలో ఎన్నికలు జరిగే పంచాయతీలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఉదయం నుంచే మొదలవ్వాలి. అయితే నామినేషన్ల స్వీకరణకు చాలా జిల్లాలో సన్నాహాలు జరగలేదు. సుప్రీంకోర్టు నుంచి స్పష్టత వచ్చేవరకు ఎన్నికలపై ముందుకు వెళ్లకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి దశలో ప్రకాశం, విజయనగరం మినహా 11 జిల్లాల్లోని 146 మండలాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని, వాటిని వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని గానీ, నామినేషన్లు స్వీకరించాలని గానీ జిల్లా అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఎలాంటి ఉత్తర్వులూ జారీ కాలేదని సమాచారం.
ఇక ఇదే నేపథ్యంలో ఎస్‌ఈసీ గవర్నర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వాలని కోరనున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్‌కు మరోసారి మెమో ఇచ్చే అవకాశం ఉంది.