TTD: అంజనాద్రిపై దేవాలయం వద్దని హైకోర్టు ఆదేశాలు
TTD: శ్రీవారి ఆలయం మినహా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశం
TTD: తిరుమలలో అంజనాద్రి ఆలయ నిర్మాణం టీటీడీ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. అంజనాద్రిపై సుందరీకరణ పనులు మినహా దేవాలయం, ఇతర నిర్మాణాలు చేపట్టవద్దని టీటీడీని కోర్టు ఆదేశించింది. సుందరీకరణ పనులకు భూమిపూజ చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈవోకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
తిరుమల శ్రీవారి వైభవాన్ని తగ్గించేలా ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రిపై దేవాలయం నిర్మాణం చేపట్టేందుకు టీటీడీ ప్రయత్నిస్తోందని కర్నూలుకు చెందిన రాఘవేంద్ర మరో ఇద్దరు పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం నిన్న విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది కొప్పినీడి రాంబాబు వాదనలు వినిపించారు. ఏడుకొండలపై ఎలాంటి విగ్రహ ప్రతిష్ఠ జరగడానికి వీల్లేదని తిరుమళై ఒరుగు పుస్తకంలో స్పష్టంగా చెప్పారన్నారు. టీటీడీ సొంతగా ఏర్పాటు చేసుకున్న కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 16న కొండపై దేవాలయం నిర్మాణం తలపెట్టారని, ఆ పనులు నిలువరించాలని కోరారు. ఇటు అంజనాద్రిపై ఎలాంటి దేవాలయ నిర్మాణం చేపట్టడం లేదని టీటీడీ తరఫున న్యాయవాది సుమంత్ వాదనలు వినిపించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సుందరీకరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
అంజనాద్రిలో అభివృద్ధి పనులకు ఇవాళ భూమిపూజ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో నిర్మాణాలు వద్దని హైకోర్టు నుంచి ఆదేశాలు రావడంతో టీటీడీ యంత్రాంగం, పాలకమండలి షాక్ గురైంది. అంజనాద్రిపైనే ఆంజనేయుడు జన్మించాడని టీటీడీ ఓ ప్రతిపాదన పండితుల ముందు పెట్టింది. దీనిపై కర్ణాటక రాష్ట్రం హంపీలోని కిష్కింధకు చెందిన గోవిందానంద సరస్వతి తొలినుంచీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.