AP Elections: ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎప్పుడెప్పుడు ఏమన్నారు?
Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.
Prashant Kishor: ప్రశాంత్ కిశోర్ మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని ఆయన ఎన్నికలకు ముందు చెప్పారు. పోలింగ్ తరువాత కూడా అదే మాట అన్నారు.
అయితే, వైఎస్ జగన్ ఆయన మాటలకు కౌంటర్ ఇచ్చారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్ టీమ్ సభ్యులతో మాట్లాడుతూ ఆయన, 2019 ఎన్నికల్లో కన్నా ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.
జగన్ కామెంట్స్ మీద రియాక్షనా అన్నట్లుగా ప్రశాంత కిశోర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఓటమిని ఎవరూ ముందు అంగీకరించరని, ఫలితాలు వస్తున్నప్పుడు కూడా ట్రెండ్స్ వ్యతిరేకంగా ఉన్నా కూడా రాజకీయ పార్టీలు తామే గెలుస్తున్నామని చెబుతారని ఆయన అన్నారు. ఫలితాలు పూర్తిగా వెలువడితే గానీ ఎవరూ వాస్తవాలు అంగీకరించరని ఆయన వ్యాఖ్యానించారు.
2019లో వైఎస్ఆర్సీపీకి పనిచేసిన ప్రశాంత్ కిశోర్
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు వైఎస్ఆర్సీపీ పనిచేసింది. 2019 పోలింగ్ ముగిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఈ ప్రకటనపై అప్పట్లో చంద్రబాబు సహా టీడీపీ నేతలు మండిపడ్డారు.ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, డీఎంకెలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తర్వాత ఐ ప్యాక్ కు ప్రశాంత్ కిశోర్ గుడ్ బై చెప్పారు. ఏపీలో మాత్రం ఐప్యాక్ జగన్ కోసం పనిచేసింది.
ఐ ప్యాక్ సూచనల మేరకు అభ్యర్థుల మార్పు
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఐప్యాక్ టీమ్ అందించిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేశారు. కొందరు సిట్టింగ్ లకు టిక్కెట్లు ఇవ్వలేదు. కొందరు సిట్టింగ్ లను కొత్త స్థానంలో బరిలోకి దింపారు. టిక్కెట్లు దక్కనివారికి నామినేటేడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. టిక్కెట్లు దక్కని అభ్యర్ధులు కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లారు.
చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ ఏడాది మార్చిలో హైద్రాబాద్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పనిచేయాలని ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు కోరారు. అయితే ఈ ప్రతిపాదనను ప్రశాంత్ కిషోర్ తిరస్కరించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశాంత్ కిషోర్ పై విమర్శలు చేశారు. చంద్రబాబుకు లబ్దికోసమే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.
ఏది ఏమైనా ఈసారి ఆయన అంచనాలు నిజమవుతాయా అన్న ప్రశ్న రాష్ట్రమంతటా వినిపిస్తోంది. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయన్నది మాత్రం కాదనలేం.