AP News: అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ భద్రత
AP News: ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల వద్ద భద్రతా
AP News: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసాల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వారి ఇళ్ల వద్దకు ఎవరు వెళ్లకుండా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్ రోజు, తర్వాత రోజు జరిగిన ఘర్షణ నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీసులను మోహరించి శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చారు. ఎన్నికల కమిషన్ తాడిపత్రిలో జరిగిన అల్లర్లను సీరియస్‌గా తీసుకొని కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరుగుతాయన్న ఇంటలిజెన్స్ హెచ్చరికలతో తాడిపత్రికి భారీగా కేంద్ర సాయుధ బలగాలు, ఏపీఎస్పీ బలగాలు వచ్చాయి. జూన్ 6వ తేదీ వరకు తాడిపత్రిలోకి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రికి వెళ్లవద్దని హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నైపథ్యంలో పోలీసులు తాడిపత్రి చుట్టుపక్కల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తాడిపత్రిలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాళ్ల దాడి కేసులో ఇప్పటికే 131 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపడుతున్నారు.