Weather Report: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడ్రోజుల్లో భారీ వర్షాలు
Weather Report: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
Weather Report: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారనుంది. దాంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడ్రోజులు పెద్దఎత్తున వర్షాలు పడనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడిందని.. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిశా, వెస్ట్ బెంగాల్ తీరాల్లో కొనసాగుతుందని స్పష్టం చేసింది.
మరోవైపు అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి వైపువాలి ఉండడంతో వచ్చే రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. గత రెండు మూడు రోజులనుంచి ఏపీ, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో వాతావరణం మరింత మేఘావృతమైంది.
కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇప్పుడు అల్పపీడనం వాయగుండంగా బలపడనుందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడనుండడంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ఇక రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగానే ఉండవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదు కానుంది.